కలం, కరీంనగర్: సింగరేణి సంస్థను పరిరక్షించుకోవడం కోసం నిర్వహిస్తున్న సభను విజయవంతం చేయాలని బీఆర్‌ఎస్ పార్టీ జిల్లా నాయకులు, కార్యకర్తలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (Gangula Kamalakar) పిలుపునిచ్చారు. సింగరేణి పరిరక్షణ లక్ష్యంగా ఈనెల 14న రామగుండంలో బీఆర్‌ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పాల్గొననున్న సభకు సంబంధించి కరీంనగర్‌లో జిల్లా ముఖ్య నాయకులతో ఆయన అధ్యక్షతన వారి నివాసంలో సోమవారం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సింగరేణి ప్రాధాన్యం, ప్రస్తుత పరిస్థితులు, సభకు తరలివెళ్లాల్సిన తీరుపై నాయకులు చర్చించారు.
సింగరేణిని కాపాడుకోవాలి..
సింగరేణి దక్షిణ భారతదేశానికి వెలుగులు అందిస్తున్న కీలకమైన బొగ్గు సంస్థ అని బీఆర్ఎస్ నాయకులు పేర్కొన్నారు. తెలంగాణకే కాకుండా దేశానికి సింగరేణి ఎంతో ముఖ్యమైనదని, ఈ సంస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో బొగ్గు ఉత్పత్తి తగ్గిపోవడంతోపాటు సింగరేణిలో అక్రమాలు జరుగుతున్నాయంటూ వారు ఆరోపించారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో బొగ్గు ఉత్పత్తికి సంబంధించి ఎలాంటి అక్రమాలు చోటుచేసుకోలేదని పేర్కొన్నారు. సింగరేణి ఉత్పత్తులు పెరిగి దక్షిణ భారతదేశానికి మరింత వెలుగులు అందించాలంటే సంస్థను పరిరక్షించుకోవాలని అభిప్రాయపడ్డారు.
సింగరేణి పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు సంస్థ ప్రయోజనాలను కాపాడాలనే ఉద్దేశంతో కేటీఆర్ ఆధ్వర్యంలో రామగుండంలో భారీ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ సభ ద్వారా సింగరేణి ఎదుర్కొంటున్న సమస్యలను ప్రజల దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు.
300 కార్లతో భారీ ర్యాలీ..
రామగుండంలో నిర్వహించే సభకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు తరలివెళ్లాలని సమావేశంలో నిర్ణయించారు. ఇందులో భాగంగా కరీంనగర్ నుంచి సుమారు 250 నుంచి 300 కార్లతో ర్యాలీగా రామగుండం వెళ్లేందుకు ప్రణాళిక రూపొందించారు. కేటీఆర్ మధ్యాహ్నం 1 నుంచి 2 గంటల మధ్య కరీంనగర్‌కు చేరుకోనున్న నేపథ్యంలో ఆయనతో కలిసి ర్యాలీగా రామగుండం సభకు వెళ్లాలని నిర్ణయించినట్లు నాయకులు తెలిపారు.
నాయకులు, కార్యకర్తలకు విజ్ఞప్తి..
జిల్లాలోని బీఆర్‌ఎస్ పార్టీ ముఖ్య నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు తమతమ వాహనాలతో ఉదయం 11 నుంచి 12 గంటలలోపు కరీంనగర్‌కు చేరుకోవాలని నాయకులు విజ్ఞప్తి చేశారు. అందరూ సమన్వయంతో పాల్గొని రామగుండం సభకు తరలిరావాలని కోరారు. సింగరేణి పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సభలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగులతో పాటు మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జిబి రామకృష్ణారావు, నగర అధ్యక్షులుచల్ల హరి శంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్, జిల్లా మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్ కాల్వ మల్లేశం, జడ్పీ మాజీ కోఆప్షన్ సభ్యులు జములుద్దిన్, మాజీ కార్పొరేటర్ నాంపల్లి శ్రీనివాస్, అర్బన్ బ్యాంక్ మాజీ డైరెక్టర్ కర్ర సూర్య శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

