కలం, కరీంనగర్: జాతీయ తపాలా వారోత్సవాలలో భాగంగా సోమవారం కరీంనగర్ ప్రధాన తపాలా కార్యాలయంలో ప్రత్యేక పోస్టల్ స్టాంపుల (ఫిలాటెలి) ప్రదర్శన (Philately Exhibition) నిర్వహించారు. ఈ ప్రదర్శనను కరీంనగర్ డివిజన్ తపాలా శాఖ సూపరింటెండెంట్ కె. సైదిరెడ్డి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్టాంపుల సేకరణ చరిత్రను, సంస్కృతిని తెలుసుకోవడానికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నారు. పెద్ద సంఖ్యలో వివిధ దేశాలు, రకాల స్టాంపులను సేకరించడం గొప్ప విషయమన్నారు.
నవంబర్ 20, 21న రెండు రోజుల పాటు కరీంనగర్ లో రాష్ట్ర స్థాయి పిలాటెలీ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు సైదిరెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఉన్న సేకరణ కర్తలు పాల్గొని ప్రదర్శించవచ్చని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్బంగా పోస్టల్ ఎస్పీ కోరారు. స్థానిక స్టాంపుల సేకరణ కర్త సయ్యద్ తాహెర్ సేకరించిన వివిధ దేశాలకు సంబంధించిన చాలా రకాల స్టాంపులను ఈ ప్రదర్శనలో ప్రదర్శించగా, పెద్ద సంఖ్యలో పాల్గొన్న కష్టమర్లు, తపాలా సిబ్బంది అరుదైన స్టాంపులను ఆసక్తిగా తిలకించారు.
ఈ కార్యక్రమంలో నార్త్ సబ్ డివిజన్ ఇన్స్ పెక్టర్ పి.అశోక్ కుమార్, ఆఫీస్ సూపర్ వైజర్ ఎం. శ్రీనివాస్, పోస్టుమాస్టర్ ఎ. తిరుపతి, ఎపిఎం (అకౌంట్స్) హరిశంకర్, సిపిసి సూపర్ వైజర్ పి.శంతన్ రావు, ఐసో టీం వ్యవస్థాపకులు ఘన్ శ్యాం ఓజా తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా స్టాంపుల సేకరణ కర్త సయ్యద్ తాహెర్ ను సత్కరించారు.

