కలం, వరంగల్ బ్యూరో: కేంద్ర ప్రభుత్వ తీరుకు వ్యతిరేకంగా, కేంద్ర ఎన్నికల సంఘం పక్షపాత ధోరణిని నిరసిస్తూ ‘ఇండియా’ కూటమి పిలుపునిచ్చిన మహా ధర్నాలో వరంగల్ ఎమ్మెల్యేలు (Warangal MLAs) పాల్గొన్నారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకులతో నాయిని రాజేందర్ రెడ్డి, కె ఆర్ నాగరాజు రేవూరి ప్రకాష్ రెడ్డి డాక్టర్ మురళి నాయక్, ఎమ్మెల్సీ బస్వరాజ్ సారయ్య, హనుమకొండ జిల్లా అధ్యక్షులు ఇనగాల వెంకటరామిరెడ్డి, నాయకులు కలిసి ధర్నాలో పాల్గొన్నారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిర్వహించిన ఈ మహా ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ , రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను తెలియజేశారు. సీఈసీ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం వ్యవహారశైలిపై నిరసన వ్యక్తం చేస్తూ, ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని, ఎన్నికల ప్రక్రియపై ప్రజలకు విశ్వాసం కలిగించేలా చర్యలు తీసుకోవాలని ధర్నాలో జ్ఞానేష్ కుమార్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తెలంగాణ భవన్ నుంచి మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు డీసీసీ అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు భారీ ర్యాలీగా ధర్నా వేదిక వైపునకు వెళ్లారు.
కాగా, ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన తెలుపుతున్న తమపై కేంద్ర ప్రభుత్వం ఆంక్షలు విధించడం, మెట్రో సేవలను నిలిపివేయడం వంటి చర్యలకు పాల్పడుతోందని మండిపడ్డారు. సర్ ఉపయోగించుకొని బీజేపీ ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించిందని.. అర్హులైన ఓటర్లను తొలగించిందని ధ్వజమెత్తారు. బీజేపీ ప్రభుత్వం ఓటు చోరీ చేస్తోందని ఫైర్ అయ్యారు. సర్‌ను రద్దు చేయాలని ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా నిరసనలు చేస్తుంటే బీజేపీ ప్రభుత్వం నాయకులపై విద్యార్థులపై కక్షపూరితంగా వ్యవహరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటుందని కాంగ్రెస్ నాయకులు ఆగ్రహించారు. ఎన్నికల కార్యాలయం పక్షపాతం చూపిస్తోందని మండిపడ్డారు. సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించే వరకు తాము ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. మోదీ, అమిత్ షా ‘సర్’ను వాడుకొని ఎన్నికల్లో గెలిచారని ధ్వజమెత్తారు. అధికారంలో ఎప్పటికీ ఉండాలనే ఆకాంక్షతో ఎన్నికల్లో అక్రమాలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షాలు ఇంత పెద్దఎత్తున ఆందోళన చేస్తున్నా.. వారు కనీసం స్పందించట్లేదని మండిపడ్డారు.

