గట్టు ఎత్తిపోతలపై రాజకీయాలు ఆపాలి: గొంగళ్ళ రంజిత్ కుమార్

కలం, జోగుళాంబ గద్వాల: నడిగడ్డ ప్రాంత ప్రజల సాగునీటి ఆశలతో ముడిపడి ఉన్న గట్టు ఎత్తిపోతల పథకం(Gattu Lift Irrigation Scheme) పై గత ప్రభుత్వాలు, ప్రస్తుత ప్రభుత్వం చేస్తున్న జాప్యానికి ఇకనైనా తెరదించాలని టీఆర్ఎస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్‌చార్జి గొంగళ్ళ రంజిత్ కుమార్ (Gongalla Ranjith Kumar) డిమాండ్ చేశారు. సోమవారం గద్వాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ… గట్టు ఎత్తిపోతల పథకాన్ని ఎన్నికల సమయంలో ఓట్ల కోసం ఉపయోగించుకుంటున్నారే తప్ప, ప్రాజెక్టును పూర్తి చేయడంలో పాలకులకు చిత్తశుద్ధి కనిపించడం లేదని ఆయన విమర్శించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి గట్టు మండలం వెనుకబడిన ప్రాంతంగానే మిగిలిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం గట్టు ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయడంలో కాలయాపన చేస్తున్నాయని ఆరోపించారు.

గట్టు, కేటీ దొడ్డి మండలాల్లో సాగునీటి వనరులు పరిమితంగా ఉండటంతో రైతులు వర్షాధార వ్యవసాయంపైనే ఆధారపడాల్సి వస్తోందని రంజిత్ కుమార్ అన్నారు. వర్షాలు సకాలంలో కురవకపోతే పంటలు ఎండిపోవడం, పెట్టుబడులు నష్టపోవడం, రైతులు అప్పుల పాలవడం వంటి సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. గట్టు ఎత్తిపోతల పథకం పూర్తయితే నడిగడ్డ ప్రాంతంలోని వేలాది ఎకరాలకు సాగునీరు అందే అవకాశం ఉందని, భూగర్భజలాలు పెరిగి వ్యవసాయ రంగం బలోపేతమవుతుందని పేర్కొన్నారు.

సాగునీరు అందుబాటులోకి వస్తే రైతులు ఒకే పంటపై ఆధారపడకుండా వివిధ పంటలు సాగు చేసుకునే అవకాశం కలుగుతుందని, స్థానికంగా ఉపాధి అవకాశాలు పెరిగి వలసలు తగ్గుతాయని వివరించారు. ఈ పథకం కేవలం ఒక సాగునీటి ప్రాజెక్టు మాత్రమే కాదని, గట్టు, కేటీ దొడ్డి మండలాల సమగ్ర అభివృద్ధికి ఇది కీలకమైన ఆధారమని ఆయన అన్నారు. రైతులు, కూలీలు, చిన్న వ్యాపారులు, గ్రామీణ కుటుంబాల జీవన ప్రమాణాలను మెరుగుపరచడంలో ఈ ప్రాజెక్టు ముఖ్యపాత్ర పోషిస్తుందని తెలిపారు.

జీవోలు మారుతున్నాయి.. కానీ రైతులకు నీరు మాత్రం అందడం లేదు!

గట్టు ఎత్తిపోతల పథకానికి సంబంధించి 2018లో రూ.553 కోట్ల అంచనా వ్యయంతో, 0.738 టీఎంసీల సామర్థ్యంతో జీవో విడుదల చేశారని, అనంతరం 2020 జనవరిలో రూ.581 కోట్లకు అంచనా వ్యయాన్ని పెంచి, 1.32 టీఎంసీలతో సవరణలు చేశారని రంజిత్ కుమార్ గుర్తుచేశారు. తాజాగా రూ.1,781 కోట్లతో 3 టీఎంసీల నీటిని వినియోగించి 33 వేల ఎకరాలకు సాగునీరు అందిస్తామని మరో జీవో విడుదల చేసినట్లు పేర్కొన్నారు.

ప్రతి జీవో విడుదలైనప్పుడు కృతజ్ఞతలు చెప్పుకుంటూ వస్తున్న అప్పుడు ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ప్రాజెక్టు పనుల పురోగతి, రైతులకు నీరు అందించే విషయంలో ప్రజలకు స్పష్టమైన సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రాజెక్టు అంచనాలు పెరుగుతున్నప్పటికీ పనులు పూర్తికాకపోవడం, నిధుల వినియోగంపై స్పష్టత లేకపోవడం, పనుల గడువులు పదేపదే మారడం వంటి అంశాలపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు.

ఇప్పటివరకు ఎంత నిధులు మంజూరయ్యాయి, ఎంత ఖర్చు చేశారు, ఎన్ని పనులు పూర్తయ్యాయి, ఇంకా ఎన్ని పనులు మిగిలి ఉన్నాయి అనే వివరాలను ప్రజలకు వెల్లడించాలని అన్నారు. గట్టు, కేటీ దొడ్డి మండలాలు ఇప్పటికీ వెనుకబాటుతనాన్ని ఎదుర్కొంటున్నాయని, ఉపాధి అవకాశాలు లేక ప్రజలు వలసలు వెళ్లాల్సిన పరిస్థితి కొనసాగుతోందని రంజిత్ కుమార్ అన్నారు. దశాబ్దాలు గడుస్తున్నా ఈ ప్రాంతానికి సాగునీరు, అభివృద్ధి అందకపోవడం పాలకుల వైఫల్యానికి నిదర్శనమని విమర్శించారు.

గత 70 సంవత్సరాలుగా ఈ ప్రాంతాన్ని పాలించిన నాయకులు ప్రజల సమస్యలను ఎందుకు పరిష్కరించలేకపోయారని ప్రశ్నించారు. ఎన్నో ఎన్నికలు వచ్చినా గట్టు ఎత్తిపోతల పథకం హామీగానే మిగిలిపోవడం ఎంతవరకు సమంజసమని నిలదీశారు. ప్రాజెక్టు పూర్తికాకపోవడంతో రైతులు సాగు విస్తీర్ణాన్ని తగ్గించుకోవాల్సి వస్తోందని, యువత ఉపాధి కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని అన్నారు. గట్టు ఎత్తిపోతల పథకం పూర్తయితే వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు, పశుపోషణ, చిన్న వ్యాపారాలు అభివృద్ధి చెందే అవకాశం ఉందని తెలిపారు.

కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపినట్లు చెబుతున్న పాలకులు, ఇప్పటివరకు జూరాల ప్రాజెక్టుకు నీరు రాకపోవడానికి కారణమేంటో ప్రజలకు వివరించాలని రంజిత్ కుమార్ డిమాండ్ చేశారు. చర్చలు, ప్రకటనలు, జీవోలు మాత్రమే కాకుండా క్షేత్రస్థాయిలో ఫలితాలు కనిపించాలని, రైతులకు సాగునీరు అందించేలా తక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. జూరాల ప్రాజెక్టు నీటి లభ్యత, కేటాయింపులు, పంపింగ్ సామర్థ్యం, కాలువల నిర్మాణం, విద్యుత్ సరఫరా వంటి అంశాలపై ప్రభుత్వం సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ప్రకటించాలని అన్నారు.

కర్ణాటక ప్రభుత్వంతో ఉన్న సమస్యలను పరిష్కరించి, అంతర్రాష్ట్ర సమన్వయంతో ప్రాజెక్టుకు అవసరమైన నీటిని అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. గట్టు ఎత్తిపోతల పథకాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవడం మానుకుని, నడిగడ్డ ప్రాంత రైతుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరించాలని ఆయన స్పష్టం చేశారు.

ప్రాజెక్టు పనులకు ప్రత్యేక కాలపరిమితి నిర్ణయించి, ప్రతి దశకు బాధ్యులైన అధికారులను నియమించి, పనులు పూర్తయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బుచ్చి బాబు, రంగస్వామి, విష్ణు, సుభాష్, సుదర్శన్, వెంకటేష్, ఆశన్న,వెంకట్రాములు, మునెప్ప, అడవి ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>