కలం, వెబ్‌డెస్క్: ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో గంజాయి కేసు విచారణకు వెళ్లిన పోలీసుల (Police)పై దాడి జరగడం తీవ్ర కలకలం రేపుతోంది. ఈ ఘటన సిరికొండ మండలం వాయిపేట్‌లో చోటుచేసుకుంది. గ్రామంలో పెరట్లో ఓ వ్యక్తి గంజాయి సాగు చేస్తున్న కేసుకు సంబంధించి విచారణకు వెళ్లిన సందర్భంలో కొందరు వ్యక్తులు పోలీసులపై దాడికి దిగారు. కొద్ది రోజుల క్రితం గ్రామంలో ఓ వ్యక్తి ఇంటి పెరటిలో గంజాయి సాగు చేస్తున్నట్లు పోలీసుల దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో పోలీసులు సదరు వ్యక్తిని అరెస్ట్ చేశారు.
నిందితుడి పెరటిలో 18 గంజాయి మొక్కలను గుర్తించారు. ఈ కేసు తదుపరి విచారణ నిమిత్తం సీఐ, ఏఎస్సై సహా నలుగురు పోలీసులు మళ్లీ ఊరికి వెళ్లారు. అసలు మీకు గంజాయి సమాచారం ఎవరు ఇచ్చారంటూ పోలీసులపై గ్రామస్తులు ఎదురుతిరిగారు. పోలీసుల వాహనంతో పాటు మొబైల్ ఫోన్లను ధ్వంసం చేశారు. మహిళలతో కలిసి రాళ్లు, కర్రలతో దాడి చేశారని పోలీసులు ఆరోపిస్తున్నారు. మరోవైపు పోలీసులే తమను కులం పేరుతో దూషించారని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గాయపడ్డ పోలీసులు ఆదిలాబాద్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

