ఎల్‌నినో ఎఫెక్ట్‌.. నల్లగొండ రైతులకు సాగు కష్టాలు

కలం, నల్లగొండ బ్యూరో: నల్లగొండ జిల్లాలో యాసంగి సాగు రైతులకు (Nalgonda Farmers) తీవ్ర పరీక్షగా మారనుంది. వానాకాలం సీజన్‌లోనే ఎల్‌నినో ఎఫెక్ట్ (El Nino Impact), ఎండల తీవ్రతతో, కరెంటు కోతలతో పంటలు ఎండిపోయి అన్నదాతలు అష్టకష్టాలు పడ్డారు. ఇప్పుడు యాసంగిలో సాగు చేస్తే ఆర్థికంగా తీవ్రంగా నష్టపోవడం, నీటి, విద్యుత్ కొరత వంటి పరిస్థితులు దాపురించాయి. ఇప్పటికే వర్షాభావంతో భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. ఇంకోవైపు జలాశయాల్లో నీరు సరిపడా లేదు. ఇలా మొత్తంగా యాసంగి సాగు ప్రశ్నార్థకంగా మారింది. ఇప్పటికే గ్రామాల్లో క్రాప్ హాలిడే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

వానాకాలం సీజన్‌లో జిల్లావ్యాప్తంగా వ్యవసాయ అధికారులు 5.86 లక్షల ఎకరాల్లో వరి సాగు అవుతుందని ప్రాథమికంగా అంచనా వేయగా.. 5.18 లక్షల ఎకరాల్లో సాగైంది. కానీ, తీరా పంట చేతికి వచ్చే సమయంలో ఎండల తీవ్రత పెరిగిపోవడం, వర్షాభావ పరిస్థితులతో సగానికి పైగా పంటలు ఎండిపోయాయి. ఆ నష్టాల నుంచి రైతులు ఇంకా తేరుకోకముందే, ఇప్పుడు యాసంగి సీజన్ మొదలుకావడం, భూగర్భ జలాలు అడుగంటడంతో రైతులు తీవ్ర ఆందోళనలో పడిపోయారు.

పావు శాతానికే సాగు పరిమితం

ఈసారి యాసంగిలో వరి సాగు 75 శాతానికిపైగా బంద్ అయ్యే ప్రమాదం కనిపిస్తోంది. సాధారణంగా లక్షలాది ఎకరాల్లో సాగుచేసే వరి పంట, ఈసారి కేవలం 25 శాతం (పావు వంతు) విస్తీర్ణానికి మాత్రమే పరిమితమయ్యే అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ అధికారవర్గాలు భావిస్తున్నాయి. అది కూడా పూర్తిగా బోరు బావుల కింద మాత్రమే అరకొరగా నాట్లు పడే సూచనలు కనిపిస్తున్నాయి.

సాధారణంగా వర్షాకాలంలో నాట్లు వేస్తే మధ్యలో వర్షాలు పడి కాస్తో కూస్తో పంట చివరికి గట్టెక్కే వెసులుబాటు ఉండేది. కానీ యాసంగి సీజన్‌లో వర్షాలు ఏమాత్రం లేకపోగా, ఇప్పుడే మొదలైన ఎండల తీవ్రత రైతులను మరింత భయపెడుతోంది. నారుమడుల్లో పోసిన కాసిన్ని నీళ్లు సైతం భానుడి తీవ్రతకు ఇంకిపోయే ప్రమాదం ఉండటంతో పంటను నిలబెట్టుకోవడం కష్టంగా మారనుంది.

విత్తన వడ్లు కొనేందుకూ..

ధైర్యం చేసి వరి సాగు చేసినా చివరి వరకు నీరు పారుతుందో లేదోననే అనిశ్చితి, భయాందోళన జిల్లా రైతులను వెంటాడుతున్నాయి. పెట్టుబడి పెట్టి నష్టపోవడం కంటే సాగుకు దూరంగా ఉండటమే మంచిదనే ఆలోచనకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మార్కెట్లలో ఉచితంగా లేదా రాయితీపై ఇచ్చినా, విత్తన వడ్లు కొనుగోలు చేసేందుకు కూడా రైతులు సాహసించడం లేదు.

మరోవైపు జిల్లాకు గుండెకాయ వంటి సాగర్ ప్రాజెక్టులో నీటి మట్టాలు అడుగంటిపో వడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఎగువ ప్రాంతాల నుంచి ఎలాంటి వరద ప్రవాహాలు లేకపోవడంతో సాగర్‌లో నీటి నిల్వలు ప్రమాదకర స్థాయిలో కనిష్టానికి పడిపోయాయి. దీంతో సాగునీరు అందించడం పక్కన పెడితే, జిల్లా ప్రజల దాహార్తిని తీర్చేందుకు సరఫరా చేయడమే అధికారులకు గగనంగా మారింది.

ఆయకట్టు ఎడారిగా మారే ముప్పు

సాగర్ ప్రాజెక్టులో నీటి నిల్వలు లేకపోవడంతో యాసంగికి సాగు నీటిని విడుదల చేసే పరిస్థితి కనిపించడం లేదు. ఫలితంగా సాగర్ ఆయకట్టు కింద వేలాది ఎకరాల్లో ఈసారి చుక్క నీరు లేక ఎడారిని తలపించడం ఖాయంగా కనిపిస్తోంది. వర్షాలు లేకపోవడం, ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు పడిపోవడంతో విద్యుత్ ఉత్పత్తి తీవ్రంగా దెబ్బతింటోంది. ఇది భవిష్యత్ రోజుల్లో వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్ సరఫరాపై కూడా ప్రతికూల ప్రభావం చూపనుంది. కరెంటు కోతలు పెరిగితే బోరు బావులపై ఆధారపడిన రైతులకు కూడా పైరుకు తడి అందించడం కష్టంగా మారుతుంది.

చుట్టుముట్టనున్న సమస్యలు

ఒకవైపు పాతాళానికి పడిపోయిన భూగర్భ జలాలు, మరోవైపు చుక్క నీరు లేని ప్రాజెక్టులు, ఇంకోవైపు విద్యుత్ కోతల భయాలు నెలకొన్నాయి. ఇలా అన్నివైపుల నుంచి సమస్యలు నల్లగొండ రైతులను చుట్టుముట్టే పరిస్థితులు ఉన్నాయి. పాలకులు, అధికారులు తక్షణమే స్పందించి యాసంగి సీజన్‌కు సంబంధించి స్పష్టమైన మార్గదర్శకాలు విడుదల చేయాలని, ప్రత్యామ్నాయ ఆరుతడి పంటలపై రైతులను చైతన్యపరచాలని విజ్ఞప్తులు వస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>