కలం, వెబ్‌డెస్క్: విపక్షాలు చేపట్టిన ఓట్ చోరీ నిరసన మార్చ్ నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ఢిల్లీలోని ఆరు మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను సోమవారం ఉదయం 6 గంటల నుంచి, మధ్యాహ్నం 4 గంటల వరకు మూసివేస్తున్నట్లు ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ (Delhi Metro Rail Corporation) ప్రకటించింది. పటేల్ చౌక్, జనపథ్, రాజీవ్ చౌక్, మండి హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, బరాఖంబా రోడ్ స్టేషన్లు ఈ జాబితాలో ఉన్నాయి. అయితే ఈ ఆరు స్టేషన్లలో ఇంటర్ చేంజ్ సదుపాయం యథావిధిగా కొనసాగుతుందని ఎక్స్ వేదికగా వెల్లడించారు. భద్రతా సంస్థల పరిశీలన తర్వాత తదుపరి అప్‌డేట్‌లు ఇస్తామని మెట్రో అధికారులు వెల్లడించారు.
మరోవైపు దీన్ దయాళ్ ఉపాధ్యాయ మార్గ్‌లో జరగనున్న ఆందోళనను దృష్టిలో ఉంచుకొని, ఐటీఓ పరిసర ప్రాంతాలలో సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు, మళ్లింపులు అమల్లో ఉంటాయని ఢిల్లీ ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రయాణికులు సంయమనం పాటించాలని, సిబ్బంది సూచనలను అనుసరిస్తూ రద్దీని నివారించాలని పోలీసులు సూచించారు. రియల్ టైమ్ అప్‌డేట్ల కోసం వాహనదారులు తమను సంప్రదించవచ్చని తెలిపారు.

