కలం, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలపై (Local Body Elections) అధికార టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి దృష్టి సారించింది. ఇటీవలే క్యాబినెట్ స్థానిక సంస్థల రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవడంతో, ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే లోపు కూటమి మధ్య సీట్ల సర్దుబాటును పూర్తిగా ముగించాలని అగ్రనేతలు భావిస్తున్నారు. ఈ క్రమంలోనే నేడు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఏపీ బీజేపీ చీఫ్ పీవీఎన్ మాధవ్ భేటీ కానున్నారు.
ఇప్పటికే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు నేతృత్వంలోని రాష్ట్ర స్థాయి సమన్వయ కమిటీ మూడు పార్టీల బలాబలాలు, క్షేత్రస్థాయి పరిస్థితులపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి అధిష్టానానికి అందజేసింది. 2024 అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులను పక్కన పెట్టి, ప్రస్తుతం ఉన్న క్షేత్రస్థాయి బలం, ఓటు బ్యాంక్ బదిలీ, గెలుపు గుర్రాల ప్రాతిపదికన సీట్లను కేటాయించేలా ప్రత్యేక ఫార్ములా రూపొందిచినట్లు సమాచారం అందుతోంది. దీంతో ఈ భేటీలో కూటమి నేతల మధ్య సీట్ల పంపకాలు, మేయర్, మున్సిపల్ చైర్మన్ స్థానాల కేటాయింపుపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
ఇదిలాఉంటే అసెంబ్లీ ఎన్నికల సమయంలో జనసేన త్యాగం చేసిందని, స్థానిక ఎన్నికల్లో జనసైనికులకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అడవితల్లి బాట 2.0 కార్యక్రమంలో అన్నారు. దీనికి టీడీపీ, బీజేపీ పార్టీలు సహకరించాలని కోరారు. ఈ నేపథ్యంలో ముగ్గురు పార్టీల అధినేతల నేటీ భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఈ భేటీలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని మూడు పార్టీల శ్రేణులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

