కలం, నిర్మల్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఆదివారం నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. అమ్మవారిని భక్తిశ్రద్ధలతో ఆహ్వానిస్తూ భక్తులు దుర్గామాత విగ్రహాలను పూజా మండపాలకు తరలించారు. దీంతో పట్టణంలోని మంజులాపూర్, నాయుడువాడ, బైల్ బజార్ ప్రాంతాలు భక్తుల సందడితో కళకళలాడాయి. జిల్లాలోని వివిధ గ్రామాల నుంచి భక్తులు నిర్మల్‌కు చేరుకుని దుర్గామాత విగ్రహాలను ట్రాక్టర్లు, ఆటోలు, ఇతర వాహనాల్లో బాజాభజంత్రీల నడుమ ఊరేగింపుగా తమ గ్రామాలకు తరలించారు.
‘‘జై భవాని.. జై జై భవాని’’ అంటూ భక్తులు చేసిన నినాదాలతో పరిసర ప్రాంతాల్లో పండుగ వాతావరణం నెలకొంది. నవరాత్రి ఉత్సవాల ప్రారంభంతో పట్టణంలో ఆధ్యాత్మిక సందడి కనిపించింది. అమ్మవారి విగ్రహాల తరలింపు, ఊరేగింపులతో ప్రధాన వీధుల్లో సందడి నెలకొంది. ఉత్సవాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

