కలం, స్పోర్ట్స్ : భారత్‌తో వందేళ్ల చారిత్రక క్రీడా బంధానికి గుర్తుగా న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు ‘కొటాహిటాంగా’(Kotahitanga Jersey) పేరిట ప్రత్యేక వన్డే జెర్సీని ఆవిష్కరించింది. నవంబర్ 4న ఆక్లాండ్‌లో భారత్‌తో ప్రారంభమయ్యే వన్డే సిరీస్‌లో న్యూజిలాండ్ (New Zealand) ఆటగాళ్లు ఈ ప్రత్యేక జెర్సీతో బరిలోకి దిగనున్నారు. ఈ రెండు దేశాల క్రీడా ప్రయాణం 1926లో భారత ఆర్మీ హాకీ జట్టు న్యూజిలాండ్ పర్యటనతో ప్రారంభమైంది. ఈ చారిత్రక మైలురాయిని పురస్కరించుకుని ముగ్గురు ప్రముఖ కళాకారులు ఈ ప్రత్యేక జెర్సీ డిజైన్‌ను రూపొందించారు.
రెండు దేశాల సంస్కృతులను ప్రతిబింబించేలా జెర్సీని తీర్చిదిద్దినట్లు న్యూజిలాండ్ క్రికెట్ అధికారి గ్లెన్ క్రిచ్లీ తెలిపారు. ఇందులో న్యూజిలాండ్ సంప్రదాయ కళలతో పాటు భారత జాతీయ పుష్పం తామర, మందార పుష్పాల స్ఫూర్తితో రూపొందించిన డిజైన్లను పొందుపరిచారు. ఈ ప్రత్యేక జెర్సీ (Kotahitanga Jersey) అభిమానులను విశేషంగా ఆకట్టుకుంటుందని పేర్కొన్నారు. భారత్–న్యూజిలాండ్ పర్యటనలో భాగంగా అక్టోబర్ 22 నుంచి ఐదు టీ20 మ్యాచ్‌ల సిరీస్, అనంతరం నవంబర్ 4 నుంచి వన్డే సిరీస్ జరగనున్నాయి. ఆ తర్వాత రెండు టెస్టుల సిరీస్ నిర్వహించనున్నారు. వందేళ్ల క్రీడా అనుబంధాన్ని గుర్తుచేసే ఈ ప్రత్యేక జెర్సీతో న్యూజిలాండ్ ఆటగాళ్లు మైదానంలోకి దిగనుండటం విశేషం.
Also Read : అంజలి ఒలింపిక్స్ కలకు నానా పటేకర్ సాయం!
Follow Us On: Instagram

