కలం, కరీంనగర్: మారుతున్న వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు ప్రత్యామ్నాయ పంటల సాగుపై దృష్టి సారించాలని మానకొండూరు ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ చైర్మన్ డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ (Kavvampally Satyanarayana) సూచించారు. నీటి వనరులను పొదుపుగా వినియోగించుకుంటూ, తక్కువ నీటితో అధిక ఆదాయం అందించే పంటలను సాగు చేసేందుకు ప్రాధాన్యమివ్వాలని కోరారు.
ఆదివారం మానకొండూరు మండలం ఖాదర్‌గూడెం గ్రామంలో కనవేని కొమురయ్య జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతల్లో చోటుచేసుకుంటున్న మార్పుల కారణంగా ఎల్‌నినో ప్రభావం ఏర్పడే పరిస్థితులు ఉన్నాయని, దీని ప్రభావంతో రానున్న రోజుల్లో వర్షపాతం, నీటి లభ్యతలో మార్పులు చోటుచేసుకునే అవకాశాలున్నాయని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో రైతులు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు. వరి సాగుపై మాత్రమే ఆధారపడకుండా, ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని కోరారు. ముఖ్యంగా తక్కువ నీటితో సాగు చేయగలిగే, అధిక ఆదాయాన్ని అందించే కూరగాయల పంటల సాగును ప్రోత్సహించుకోవాలని సూచించారు. వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా పంటల ఎంపిక చేసుకోవడం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవడంతో పాటు మెరుగైన ఆదాయం పొందే అవకాశం ఉంటుందని వివరించారు.
హామీ నిలబెట్టుకున్న సర్పంచ్
పంచాయతీ ఎన్నికల సమయంలో గ్రామ ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు సొంత నిధులతో మినరల్ వాటర్ ప్లాంట్‌ను ఏర్పాటు చేసిన సర్పంచ్ కనవేని అక్షయ, శ్రీనివాస్ దంపతులను ఎమ్మెల్యే (Kavvampally Satyanarayana) ఈ సందర్భంగా అభినందించారు. గ్రామ ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు అందించాలనే లక్ష్యంతో ముందుకు రావడం అభినందనీయమన్నారు. ఖాదర్‌గూడెం గ్రామ శాఖ అధ్యక్షుడు అంకుస్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో సర్పంచ్ కనవేని అక్షయ, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు యాద శ్రీనివాసరెడ్డి, ప్యాక్స్ చైర్మన్ ప్రసాద్ శ్రీనివాసరెడ్డి, సీఐ శ్రీలత, ఏఎంసీ మాజీ చైర్మన్ మరవెల్లి యాదవ్, వైస్ చైర్మన్ రామిడి తిరుమల్‌రెడ్డి, నాయకులు రేమిడి శ్రీనివాసరెడ్డి, మీస సత్యనారాయణ, గొల్లెన కొమురయ్య, పేడ తిరుపతిరెడ్డి, తోట శ్రీనివాస్, బుర్ర చంద్రశేఖర్, కుంభం చిరంజీవి, కనకం అశోక్, కోండ్ర సురేష్, రేవెల్లి రాజలింగం, ముక్కెర సతీష్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభించిన ఎమ్మెల్యే
మానకొండూర్ మండలం అన్నారం గ్రామంలో అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహించే క్రికెట్ టోర్నమెంట్ ను ఆదివారం ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ద్యావ శ్రీనివాస్ రెడ్డి, పార్టీ నాయకులు కిషన్, మందల మహేందర్ తోపాటు అంబేద్కర్ యూత్ అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు.
Also Read : పేలిన పవర్ బ్యాంక్.. విమానంలో మంటలు!
Follow Us On: X(Twitter)

