కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ పంచాయతీ రాజ్, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లపై (BC Reservations) రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్ల మార్పులకు సంబంధించి ఏపీ ప్రభుత్వం జీవో నెంబర్ 153 (AP GO 153)ను అధికారికంగా విడుదల చేసింది.
సుప్రీంకోర్టు, హైకోర్టుల తీర్పుల ప్రకారం, స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్ల శాతం 50 దాటకూడదనే నిబంధన అమలులోకి రావడంతో ఈ కొత్త ఉత్తర్వులు జారీ అయ్యాయి. గతంలో బీసీలకు అమలు చేసిన 34 శాతం రిజర్వేషన్ల స్థానంలో సుప్రీంకోర్టు విధించిన 50 శాతం పరిమితికి లోబడి మార్పులు చేశారు. బీసీల రిజర్వేషన్లను శాస్త్రీయంగా నిర్ధారించడానికి ఏర్పాటు చేసిన డెడికేటెడ్ కమిషన్ నివేదికను, దాని సిఫార్సులను ప్రభుత్వం ఆమోదించింది.
ఈ కమిషన్ సూచనలకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల మొత్తం రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా స్థానిక సంస్థల వారీగా స్థానాలను ఖరారు చేశారు. ఈ జీవో (AP GO 153) ఆధారంగా పంచాయతీలు, మండలాలు, జిల్లా పరిషత్‌ల స్థానాల కేటాయింపు ప్రక్రియ తదుపరి చర్యలను వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. కోర్టు ఉత్తర్వులకు అనుగుణంగా రూపొందించిన ఈ విధానం ద్వారా స్థానిక పోరుకు మార్గం సుగమమైంది.
Also Read : ఇంద్రకీలాద్రిపై దసరా తొలిరోజే భక్తులకు చుక్కలు
Follow Us On : WhatsApp

