కలం, మెదక్ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో ఎప్పుడూ హాట్ టాపిక్‌గా ఉండే సిద్దిపేటలో ఇప్పుడు “జిల్లా దశాబ్ది ఉత్సవాలు” అధికార, ప్రతిపక్షాల మధ్య రాజకీయరంగు పులుముకున్నాయి. సిద్దిపేట జిల్లా (Siddipet District) ఏర్పాటై పదేండ్లు పూర్తవుతున్న సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మూడు రోజుల పాటు (9, 10, 11 తేదీల్లో) ఘనంగా నిర్వహిస్తున్న జిల్లా దశాబ్ది వేడుకలు రాజకీయాల్లో హీట్ పెంచుతున్నాయి.
రానున్న మున్సిపల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే బీఆర్ఎస్ పార్టీ ఈ దశాబ్ది ఉత్సవాలను తెరపైకి తెచ్చిందని ప్రత్యర్థి పార్టీలు గట్టిగా ఆరోపిస్తున్నాయి. ప్రజాక్షేత్రంలో తమపట్టును నిలుపుకొవడానికి, అన్ని వర్గాల ప్రజలను భాగస్వాములను చేస్తు మరోసారి భావోద్వేగాల ద్వారా ఆకట్టుకోవడానికి బీఆర్ఎస్ ఈ వేడుకలను ఒక అస్త్రంగా వాడుకుంటోందని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలం నాటి సెంటిమెంట్‌ను మళ్లీ రగిలించి, సిద్దిపేట గడ్డపై తమ పట్టును నిలుపుకోవడమే ఈ ఉత్సవాల అసలు ఉద్దేశమని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.
జిల్లా దశాబ్ది ఉత్సవాలు- హరీష్ మాస్టర్ ప్లాన్
సిద్దిపేట జిల్లా ఏర్పాటు అనేది ఈ ప్రాంత ప్రజల ఎన్నో దశాబ్దాల కల. నాడు ఉద్యమ నేత కేసీఆర్ ఏ చేతితో అయితే దరఖాస్తు ఇచ్చారో, అదే చేతితో జిల్లా ఏర్పాటు ఫైలుపై సంతకం చేశారని, 2016 అక్టోబర్ 11న సిద్దిపేట జిల్లా ఆవిర్భవించిందని, 2026 అక్టోబర్ 11 పదేళ్లు పూర్తవుతున్న సందర్భంగా జిల్లా దశాబ్ది ఉత్సవాల నిర్వహించలని స్ధానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) నిర్ణయించారు.
సిద్దిపేట జిల్లా (Siddipet District) ఏర్పాటుతో అన్ని వర్గాల ప్రజలకు ఎంతో మేలు జరిగింది. సమగ్రాభివృద్ధిలో సిద్దిపేట రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. సిద్దిపేట ప్రజల కలలైన గోదావరి జలాలు నేడు మన నేలలను పారిస్తుండగా, సిద్దిపేటకు రైలు కూడా వచ్చింది. అలాగే, అన్ని ప్రముఖ విద్యాలయాలను సిద్దిపేటలో నెలకొల్పుకోవడం జరిగిందని హరీష్ రావు పేర్కొన్నారు. బిఅర్ఎస్ అధికారం కొల్పొయిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా బిఅర్ఎస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహించినప్పటికి, పెద్దగా సామన్య ప్రజలను భాగస్వాములను చేయలేకపోయింది.
దీంతో దాదాపు మూడేళ్ల తర్వాత అందివచ్చిన అవకాశంగా సిద్దిపేట జిల్లా దశాబ్డి ఉత్సవాలను పేరుతో అన్ని వర్గాల ప్రజలను కార్యక్రమాల్లో భాగస్వాములు చేసే లక్ష్యంతో వివిధ వర్గాల వారితో కార్యక్రమాలు రూపొందించారు. తెలంగాణ ఉద్యమ తరహలో సెంటిమెంట్, ఎమోషనల్ టచ్ ఇస్తూ, తమ పట్టునిలుపుకోవాడానికి బిఅర్ఎస్ పార్టీ ప్రణాళిక రూపోందించినట్టు తెలుస్తుంది. ఎన్నో దశాబ్దాల కల అయిన సిద్దిపేట జిల్లా ఏర్పాటు జరిగి అక్టోబర్ 11 నాటికి పదేళ్లు పూర్తికానున్న సందర్భంగా, జిల్లా పదేళ్ల పండుగను దశాబ్ది ఉత్సవాలను మూడు రోజులపాటు అత్యంత వైభవంగా, పండుగ వాతావరణంలో అన్ని వర్గాల వారికి భాగస్వామ్యం చేస్తు నిర్వహించలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు ప్రణాళికను రూపొందించారు.
జిల్లా ఏర్పాటుకు ముందు నాటి పరిస్థితులకు, జిల్లా ఏర్పడిన తర్వాత వచ్చిన మార్పులకు సంబంధించిన చారిత్రక అంశాలను భావి తరాలకు అందించేందుకే ఈ వేడుకలను రూపకల్పన చేశారు. ముందుగా వారం రోజుల పాలు జిల్లా ఏర్పాటు వేడుకలు చేయాలని అనుకున్నా.. తర్వాత మూడు రోజులకు పరిమితం చేశారు. సిద్దిపేట జిల్లా ఏర్పాటుతోనే ప్రాంతం సర్వతోముఖాభివృద్ధి చెందిందని, అన్ని రంగాల్లోనూ సాధికారత సాధించామని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు గట్టిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు.
ఉనికి నిలుపుకోవడానికే దశాబ్ది ఉత్సవాలు: కాంగ్రెస్
హరీష్ రావు రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసమే హరీష్ రావ్ సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల పేరుతో డ్రామాలు ఆడుతున్నారని తీవ్రస్థాయిలో వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) చైర్మన్ మీసం మహేందర్ యాదవ్ ధ్వజమెత్తారు. దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు SIR పై పోరాటం చేస్తుంటే.. ఓట్లు తొలగిచేందుకు కేంద్రంలోని బీజేపీ యత్నిస్తుంటే, హరీష్ రావ్ మాత్రం తన ఉనికిని చాటుకునేందుకు దశాబ్ది ఉత్సవాల పేరుతో జిమ్మిక్కులు చేస్తున్నారని విమర్శించారు.
కాళేశ్వరం తదితర ప్రాజెక్టుల పేరుతో కోట్ల రూపాయలు దండుకున్న హరీష్ రావ్, ప్రాజెక్టు నిర్వాసిత రైతులకు సరైన నష్టపరిహారం ఇవ్వకుండా తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. 10 ఏండ్ల బిఅర్ఎస్ పాలనలో సిద్దిపేట ప్రజలకు హరీష్ రావ్ దగా చేసరని అరోపించారు. సిద్దిపేట లో హరీష్ రావ్ ఆయన అనుచరులు మాత్రమే లాభపడ్డరని ఆరోపించారు. ఇది ప్రజల కోసం చేస్తున్న ఉత్సవాలు కాదని, కేవలం హరీష్ రావు తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడానికి ఆడుతున్న “డ్రామా” అని కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.
సిద్దిపేట జిల్లా దశబ్ది ఉత్సవాలు, పేరుతో ఎన్ని డ్రామాలు చేసినా సిద్దిపేట ప్రజలు ఇకపై హరీష్ రావును నమ్మే పరిస్థితి లేదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో నిర్వహించిన విధంగానే అన్ని వర్గాల వారితో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి, సిద్దిపేట జిల్లా సెంటిమెంట్‌ను మరోసారి రాజకీయంగా క్యాష్ చేసుకోవాలని బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రానున్న సిద్ధిపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రజల మద్దతు కోసం, బీఆర్ఎస్ పార్టీ జిల్లా సెంటిమెంట్ వ్యూహాన్ని తీసుకువచ్చి.. హంగామా చేయాలని చూస్తున్నరని కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు.
రాబోయే సిద్దిపేట మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పేరుకే సిద్దిపేట దశాబ్ది ఉత్సవాలు ఐనప్పటికీ.. జరుగుతున్నదంతా రానున్న మున్సిపల్ ఎన్నికల ముందస్తు సమరంగా మారినవి. ఒకవైపు పదేళ్ల ప్రస్థానం పేరుతో ప్రజల్లోకి వెళ్లాలని బీఆర్ఎస్ చూస్తుంటే, మరోవైపు ఇదంతా రాజకీయ మైలేజ్ కోసమే అని ప్రతిపక్షాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. ఈ ఉత్సవాలు సిద్దిపేట రాజకీయాల్లో ఎలాంటి పరిణామాలకు దారితీస్తాయనేది వేచి చూడాలి.

