కలం, నేషనల్ డెస్క్: ఢిల్లీలో ఆందోళనల్లో భాగంగా అరెస్ట్ చేసిన లాయర్లను వెంటనే వదిలిపెట్టాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) పోలీసులను ఆదేశించారు. కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద శనివారం తలపెట్టిన నిరసన ప్రదర్శన నేపథ్యంలో ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు వద్ద శాంతియుతంగా ఆందోళన చేస్తున్న సీనియర్ మహిళా లాయర్లు సహా 50-60 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సమాచారం తెలుసుకున్న సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ వెంటనే సీజేఐకి లేఖ రాసింది. వెంటనే స్పందించిన సీజేఐ అడ్వకేట్లను విడుదల చేయాలని పోలీసులను ఆదేశించారు. సీజేఐ ఆదేశాల మేరకు పోలీసులు వారిని విడుదల చేసినట్లు ‘సుప్రీంకోర్టు అడ్వకేట్స్-ఆన్-రికార్డ్ అసోసియేషన్’ అధ్యక్షుడు అడ్వకేట్ దేవ్వ్రత్ ప్రకటించారు.
బార్ అసోసియేషన్ నిరసన..
సుప్రీంకోర్టు ఛాంబర్ల నుంచి లాయర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడం ఆందోళనకరమని ఎస్సీబీఏ అధ్యక్షుడు ప్రదీప్ రాయ్ ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. ‘‘అడ్వకేట్లను అకారణంగా నిర్బంధించడం.. బెదిరింపులకు గురిచేయడాన్ని సహించేది లేదు. అరెస్టయిన లాయర్లను వెంటనే విడుదల చేయాలి’’ అని ప్రదీప్ రాయ్ డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఢిల్లీ డీసీపీతో మాట్లాడిన ప్రదీప్ రాయ్.. లాయర్లను వెంటనే విడుదల చేస్తున్నట్లు ఆయన హామీ ఇచ్చారని మరో పోస్ట్ ద్వారా తెలిపారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న న్యాయవాదులపై పోలీసులు బలప్రయోగానికి దిగారని ఆరోపిస్తూ ప్రగ్యా బాఘెల్ (ఎస్సీబీఏ గౌరవ కార్యదర్శి) సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు. అరెస్టయిన వారి క్షేమ సమాచారాన్ని, ఉన్నచోటును గుర్తించి, చట్టపరమైన సాయం అందేలా చూడాలని కోరారు.
ఆదివారం అత్యవసర విచారణ..
ప్రధాన ఎన్నికల కమిషనర్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్షాలు, సీజేపీ తలపెట్టిన ఆందోళనల నేపథ్యంలో.. ప్రజా రవాణా వ్యవస్థపై పూర్తిస్థాయి నిషేధం విధించొద్దని శుక్రవారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అయినా అధికారులు ఢిల్లీ మెట్రో స్టేషన్లను మూసివేయడంతో పాటు రైలు సర్వీసులను రద్దు చేశారని ఆరోపిస్తూ కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌పై జస్టిస్ జాయ్మాల్య బాగ్చీ, జస్టిస్ మోహనతో కూడిన ధర్మాసనం ఆదివారం విచారణ చేపట్టనుంది.
జులైలో జంతర్ మంతర్ వద్ద జరిగిన విద్యార్థుల ఆందోళనల్లో హింసపై స్వతంత్ర విచారణ కోరిన పిటిషనర్లలో ఒకరైన అడ్వకేట్ శైలేంద్ర మణి త్రిపాఠి ఈ కంటెంప్ట్ పిటిషన్ దాఖలు చేశారు. సుప్రీంకోర్టు ఆదేశాలను ఉద్దేశపూర్వకంగా ఉల్లంఘించినందుకు కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్, ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్, ఢిల్లీ మెట్రో రైల్ కార్పొరేషన్ ఛైర్పర్సన్ తారపై కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకోవాలని పిటిషనర్ కోరారు.

