కలం, ఖమ్మం బ్యూరో: అంతర్జాతీయ క్రీడా వేదికలపై తెలంగాణ పతాకం రెపరెపలాడేలా, మన క్రీడాకారులు పతకాలతో మెరిసేలా ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) అన్నారు. గిరిజన ప్రాంతాల్లో దాగి ఉన్న క్రీడా ప్రతిభను వెలికితీసి, వారికి అత్యుత్తమ శిక్షణ ఇవ్వడమే లక్ష్యమని స్పష్టం చేశారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలోని మినీ స్టేడియంలో రాష్ట్రస్థాయి అండర్-20 బాలికల కబడ్డీ పోటీలను మంత్రి అట్టహాసంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ… దసరా, నవరాత్రులు, బతుకమ్మ పండుగల వేళ రాష్ట్రంలోని 33 జిల్లాల నుండి విచ్చేసిన క్రీడాకారిణులతో అశ్వారావుపేటలో పండుగ వాతావరణం నెలకొందని హర్షం వ్యక్తం చేశారు.
ఐదు ఎకరాలకు పైగా విస్తీర్ణంలో ఉన్న అశ్వారావుపేట మినీ స్టేడియాన్ని భవిష్యత్తులో పట్టణానికి మణిహారంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు. వ్యాయామ ఉపాధ్యాయుడిగా పనిచేసిన అనుభవంతో క్రీడాకారులను ప్రోత్సహిస్తున్న స్థానిక శాసనసభ్యులు జారే ఆదినారాయణను అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు క్రీడల్లోనూ రాణించి ఉన్నత శిఖరాలకు చేరుకోవాలన్నారు. గెలుపోటములను సమానంగా స్వీకరిస్తూ క్రీడాస్ఫూర్తిని చాటాలని పిలుపునిచ్చారు.
అంతకుముందు, రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారిణులు, స్థానిక మహిళలు బతుకమ్మలతో అశ్వారావుపేట ప్రధాన కూడలి నుంచి క్రీడా ప్రాంగణం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. మైదానానికి చేరుకున్న అనంతరం మంత్రి జాతీయ జెండాను ఆవిష్కరించి, రిబ్బన్ కట్ చేసి పోటీలను ప్రారంభించారు. మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి శుభాకాంక్షలు తెలిపారు. ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురామిరెడ్డి మాట్లాడుతూ.. మారుమూల గిరిజన ప్రాంతంలో 33 జిల్లాల పోటీలను అద్భుతంగా నిర్వహించడం అభినందనీయమన్నారు.
జిల్లా కలెక్టర్ అంకిత్ మాట్లాడుతూ… జిల్లాలో ఆర్చరీ, షూటింగ్ క్రీడలకు మౌలిక వసతులు పెంచుతున్నామని, వేసవి శిక్షణ శిబిరాల ద్వారా ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. జిల్లా ఎస్పీ రోహిత్ రాజు మాట్లాడుతూ.. క్రీడాకారిణుల పోటీతత్వాన్ని చూసి స్థానిక యువత స్ఫూర్తి పొందాలన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, మున్సిపల్ కమిషనర్ దిలీప్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, వివిధ జిల్లాల క్రీడాకారిణులు, అధికారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

