కలం, ఖమ్మం బ్యూరో: కొత్తగూడెం ఎయిర్‌పోర్టును పట్టువదలకుండా సాధిస్తామని, సుజాతనగర్ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేయడమే లక్ష్యమని ఎమ్మెల్యే కూనంనేని (MLA Kunamneni) సాంబశివరావు తెలిపారు. శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎయిర్పోర్ట్ నిర్మాణం భూసేకరణ ఆలస్యం వల్ల జాప్యమైనా త్వరలోనే సాధిస్తామన్నారు. సుజాతనగర్లో నాన్-షెడ్యూల్డ్ భూములు లభ్యంగా ఉన్నందున కోల్డ్ స్టోరేజీలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తామన్నారు. గృహ పరిశ్రమల ద్వారా 300 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తున్నామని చెప్పారు.
అలాగే జీవో 187 ద్వారా సుజాతనగర్‌కు రూ. 8.75 కోట్లతో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరైందని, 4-5 రోజుల్లో శంకుస్థాపన చేస్తామన్నారు. ఇందులో నర్సరీ నుంచి ఇంటర్ వరకు ఉచిత ఇంగ్లీష్ బోధనతోపాటు ఉదయం అల్పాహారం, మధ్యాహ్న భోజనం, సాయంత్రం స్నాక్స్ అందిస్తామన్నారు.
నాయకులగూడెం నుండి సుజాతనగర్ వరకు 4-లైన్ల రోడ్డు విస్తరణ, మోడల్ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని కూనంనేని తెలిపారు. ఈ సమావేశంలో పలువురు ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు పాల్గొన్నారు.

