స్థానిక పాల‌న‌ను సుల‌భం చేసిన కేసీఆర్‌: ఎర్రబెల్లి

కలం, మహబూబాబాద్‌: మహబూబాబాద్‌ (Mahabubabad) జిల్లా ఏర్పాటై పదేళ్లు పూర్తయిన సందర్భంగా మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి ద‌యాక‌ర్ రావు (Errabelli Dayakar Rao) ఆధ్వ‌ర్యంలో బీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం జిల్లా కలెక్టరేట్‌ వద్ద సంబరాలు నిర్వహించారు. మాజీ సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి పాలాభిషేకం చేసి జిల్లా ఆవిర్భావాన్ని గుర్తు చేసుకొని సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కేసీఆర్‌ కృషి, దూరదృష్టితోనే 2016 అక్టోబర్‌ 11న మహబూబాబాద్‌ జిల్లా ఏర్పాటైందని పేర్కొన్నారు. గతంలో ఉమ్మడి వరంగల్‌ జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు మానుకోట ప్రజలు అనేక ఇబ్బందులు పడేవారని, జిల్లా ఏర్పాటు తర్వాత పాలన ప్రజలకు చేరువైందని అన్నారు. కలెక్టరేట్‌, ఎస్పీ కార్యాలయం, మెడికల్‌, నర్సింగ్‌, హార్టికల్చర్‌ కళాశాలల ఏర్పాటు ద్వారా జిల్లా అభివృద్ధికి బాటలు పడ్డాయని పేర్కొన్నారు. గిరిజన తండాలకు రహదారులు, మిషన్‌ భగీరథ ద్వారా తాగునీటి సదుపాయాలు కల్పించడంతోపాటు తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి స్థానిక పాలనను సులభతరం చేసినట్లు వివరించారు.

గిరిజనుల రిజర్వేషన్లను 6 శాతం నుంచి 10 శాతానికి పెంచిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని ఎర్రబెల్లి అన్నారు. జిల్లా పరిధిలోని తొర్రూరును రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయడం కూడా పాలనా సౌలభ్యానికి దోహదపడిందని తెలిపారు. మహబూబాబాద్‌ జిల్లా పదేళ్ల ప్రస్థానంలో జరిగిన అభివృద్ధిని గుర్తుచేసుకుంటూ జిల్లా ఏర్పాటుకు కృషి చేసిన కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ మంత్రి సత్యవతి రాథోడ్‌, మాజీ మంత్రి రెడ్యా నాయక్‌, మాజీ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, మాజీ ఎంపీ మాలోత్‌ కవిత, మున్సిపల్‌ చైర్మన్‌ రామ్మోహన్‌రెడ్డి, మాజీ జెడ్పీ చైర్‌పర్సన్‌ బిందు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>