అడవిలో అద్భుతం.. మంచిర్యాలలో దేశంలోనే తొలి అడ్వెంచర్!

కలం, వెబ్ డెస్క్: అడవుల సంరక్షణ, పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడంతోపాటు ఎకో టూరిజాన్ని ప్రోత్సహించేందుకు మంచిర్యాల (Mancherial) జిల్లా అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఆదివారం ఫారెస్ట్ మారథాన్ రన్ (Forest Marathon) నిర్వహించనున్నట్లు జిల్లా DFO రాహుల్ కిషన్ జాదవ్ తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన గ్రీన్‌సీక్వర్ ఫౌండేషన్ (GreenSequr Foundation) సహకారంతో దేశం, రాష్ట్రంలో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తెలిపారు.

చారిత్రక గాంధారి ఖిల్లా (Gandhari Khilla) పరిసరాల్లోని దట్టమైన అడవులు, కొండల మధ్య ఉదయం 5 గంటల నుంచి 11 గంటల వరకు ఈ కార్యక్రమం జరగనుందని ఇందుకోసం మూడు విభాగాల్లో పరుగుల మార్గాలను సిద్ధం చేశామన్నారు. పాల్గొనేవారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అటవీ శాఖ అధికారులు ఏర్పాట్లు చేశామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించేందుకు మార్గమధ్యంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడంతో పాటు తాగునీటి సదుపాయం కల్పించినట్లు వివరించారు.

ఇతర దేశాల నుంచి సైతం

ఈ పరుగులో పాల్గొనేందుకు తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి అలాగే జర్మనీ, ఆస్ట్రేలియా దేశాల నుంచి సుమారు 300 మంది పేర్లు నమోదు చేసుకున్నారని తెలిపారు. ఇందులో పాల్గొనే వారికి టీ-షర్టు, పతకం, ప్రశంసాపత్రంతో పాటు అల్పాహారం అందించనున్నామన్నారు. ఎనిమిదేళ్లు పైబడిన పిల్లలు 5 కిలోమీటర్లు, 14 ఏళ్లు పైబడినవారు 10 కిలోమీటర్లు, 18 ఏళ్లు పైబడిన వారు 30 కిలోమీటర్ల పరుగులో పాల్గొనేలా ఏర్పాట్లు చేశామన్నారు.

పర్యాటక రంగానికి గుర్తింపు

పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే వారి గౌరవార్థం మొక్కలు నాటనున్నారు. మందమర్రి మండలం బొక్కలగుట్ట సమీపంలోని గాంధారి వనంలో ఇందుకు ఏర్పాట్లు చేశారు. ఫారెస్ట్ మారాథాన్ (Forest Marathon) ద్వారా మంచిర్యాల జిల్లాలోని ప్రకృతి అందాలను, అటవీ ప్రాంతాలను విస్తృతంగా పరిచయం చేసి పర్యాటకంగా ఈ ప్రాంతానికి గుర్తింపు తీసుకురావాలని అటవీ శాఖ లక్ష్యంగా పెట్టుకుందని ఆయన వివరించారు.

Also Read : కేంద్ర సంచలన సర్వే.. తెలంగాణలో భారీగా చెరువులు గాయబ్!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>