కలం, స్పోర్ట్స్ : ‘‘నా లక్ష్యాన్ని ఇంకా చేరలేదు. ప్రయాణం చాలా దూరం ఉంది. తప్పకుండా సాధిస్తా’’ అంటూ భారత స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ (Aman Sehrawat) చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం కీలకంగా మారాయి. ఆసియా క్రీడల్లో పసిడి పతకం సాధించిన తర్వాత కూడా అమన్ ఇలా అనడం ప్రాధాన్యం సంతరించుకుంది. శనివారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన అమన్ ఆసియా గేమ్స్ పసిడి గెలిచినా తన అసలు లక్ష్యం ఇంకా నెరవేరలేదని స్పష్టం చేశారు. ఒలింపిక్స్ స్వర్ణ పతకం సాధించడమే తన ఏకైక ధ్యేయమని వెల్లడించారు.
జపాన్‌లో జరిగిన ఆసియా క్రీడల ఫైనల్లో ప్రపంచ ఛాంపియన్ హాన్ చోంగ్ సాంగ్‌ను ఓడించి అమన్ తొలి ఆసియా పసిడి పతకాన్ని ముద్దాడారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్ చివర్లో రెండు పాయింట్లు సాధించి 11-7 తేడాతో విజయాన్ని ఖాయం చేసుకున్నారు. గతంలో 61 కేజీల విభాగంలో పోటీపడి రజతం గెలిచినప్పటికీ, కోచ్‌ల సలహాతో మళ్లీ 57 కేజీల విభాగానికి మారి ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించినట్లు ఆయన వివరించారు.
గతంలో బరువు నియంత్రణ సమస్యలతో నిషేధం ఎదుర్కొని ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు దూరం కావడం తీవ్ర నిరాశకు గురిచేసిందని అమన్ చెప్పారు. అయితే ఆ చేదు జ్ఞాపకాల నుంచి కోలుకుని, పట్టుదలతో శ్రమించి ఈ విజయాన్ని అందుకున్నానని తెలిపారు. ఆసియా క్రీడల్లో సాధించిన ఈ విజయం తనకు కొండంత ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చిందన్నారు. భారత్‌కు ఒలింపిక్స్ రెజ్లింగ్‌లో స్వర్ణ పతకం అందించడమే లక్ష్యంగా ఆయన తన సాధనను కొనసాగిస్తున్నారు.

