కలం, ఎర్రుపాలెం: తెలంగాణ ‘చిన్న తిరుపతి’గా పేరొందిన జమలాపురం (Jamalapuram) దేవస్థానంలో ఈ నెల 11 నుంచి 20 వరకు (విజయదశమి) దేవి శరన్నవరాత్రోత్సవాలు వైభవంగా జరగనున్నట్లు ఆలయ ఈవో కొత్తూరు జగన్మోహన్రావు తెలిపారు. ఈ ఉత్సవాల ప్రారంభోత్సవానికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క దంపతులు హాజరుకానున్నారు.
ఈ వేడుకల్లో భాగంగా కలశస్థాపన, పద్మావతి అమ్మవారికి సామూహిక కుంకుమార్చన, మూలా నక్షత్రం రోజున సరస్వతీ దేవి పూజలు-అక్షరాభ్యాసాలు, సామూహిక చండీ హోమాలు, విజయదశమినాడు సమీ పూజలు నిర్వహించనున్నారు. ఉత్సవాల సందర్భంగా భక్తులందరికీ ప్రతిరోజూ మహా అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు ఈవో వెల్లడించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీవారి దర్శనం చేసుకోవాలని ధర్మకర్త ఉప్పల విజయ్ దేవ శర్మ, ప్రధాన అర్చకులు శ్రీనివాస శర్మ కోరారు.

