కలం, జోగులాంబ గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రి (Gadwal Hospital) ఎదుట జూనియర్ డాక్టర్లు శనివారం రిలే నిరాహార దీక్ష చేపట్టారు. తమకు రావాల్సిన స్టైపెండ్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. నెలకు రూ.29,972 చెల్లించాల్సి ఉండగా కేవలం రూ.5 వేలు మాత్రమే చెల్లిస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. జనవరి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా చెల్లించలేదన్నారు. పెండింగ్‌లో ఉన్న స్టైపెండ్‌ను వెంటనే విడుదల చేయాలని కోరారు. నిరాహార దీక్షలో పాల్గొంటున్న రోజులకు కూడా వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించి న్యాయం చేయకపోతే ఆందోళన ఉధృతం చేస్తామని జూనియర్ డాక్టర్లు హెచ్చరించారు.

