కలం, పెద్దపల్లి: తెలంగాణలో పరిపాలనను ప్రజలకు చేరువ చేయాలనే లక్ష్యంతో మాజీ సీఎం కేసీఆర్ 10 జిల్లాలను 33 జిల్లాలుగా పునర్వ్యవస్థీకరించి విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ (Koppula Eshwar) పేర్కొన్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు పెద్దపల్లి పట్టణంలోని తెలంగాణ అమరవీరుల స్తూపం, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కొప్పుల ఈశ్వర్, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ డాక్టర్ దాసరి మమతా రెడ్డి మాట్లాడుతూ.. పెద్దపల్లిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించడంతో ప్రజల చిరకాల ఆకాంక్ష నెరవేరిందన్నారు. కలెక్టరేట్, జిల్లా స్థాయి కార్యాలయాలు అందుబాటులోకి రావడంతో సుదూర ప్రాంతాలకు వెళ్లే తిప్పలు తప్పాయని తెలిపారు. రైతుబంధు, 24 గంటల ఉచిత విద్యుత్, సాగునీటి ప్రాజెక్టులు, మెడికల్ కళాశాలలు, గురుకులాలు, మిషన్ భగీరథతో కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శంగా నిలిచిందని కొనియాడారు.
హామీల అమలులో కాంగ్రెస్ విఫలం
ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని బీఆర్ఎస్ నాయకులు విమర్శించారు. రైతులకు సాగునీరు, విద్యుత్ సమస్యలు తలెత్తుతున్నాయని, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి, తులం బంగారం వంటి వాగ్దానాలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్, రఘువీర్ సింగ్, ఉప్పు రాజ్ కుమార్, మార్కు లక్ష్మణ్, వంగల తిరుపతి రెడ్డి, స్రవంతి మోహన్ రావు, సందీప్ రావు, వెన్నం సుజాత రవీందర్, గుణపతి, సూర శ్యామ్, భూమేష్, పల్లె మధు, కాశిపాక వాసు తదితర మండల, పట్టణ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

