కలం, స్పోర్ట్స్: 42 ఏళ్ల వయసులోనూ తన బ్యాటింగ్ పవర్ తగ్గలేదని నిరూపించాడు దక్షిణాఫ్రికా మాజీ స్టార్ ఏబీ డివిలియర్స్ (AB de Villiers). వరల్డ్ ఛాంపియన్‌షిప్ ఆఫ్ లెజెండ్స్ (WCL)లో ఆస్ట్రేలియాపై కేవలం 37 బంతుల్లోనే శతకం బాదాడు. దీంతో అతన్ని మళ్లీ ఐపీఎల్‌లో చూడాలంటూ అభిమానులు సోషల్ మీడియాలో కోరుతున్నారు. ఆస్ట్రేలియా ఛాంపియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డివిలియర్స్ అజేయంగా 111 పరుగులు చేశాడు. కేవలం 40 బంతుల్లోనే ఈ స్కోరు సాధించాడు. అతడి ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, 11 సిక్సర్లు ఉన్నాయి. దీంతో 210 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా ఛాంపియన్స్ 15.4 ఓవర్లలోనే ఛేదించింది.
ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. డివిలియర్స్ మెరుపు ఇన్నింగ్స్‌తో అభిమానుల్లో ఐపీఎల్ రీఎంట్రీపై ఆశలు పెరిగాయి. 2027 ఐపీఎల్ వేలంలో అతను పేరు నమోదు చేయాలని పలువురు సోషల్ మీడియా వేదికగా విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుత బౌలర్లను కూడా తన బ్యాటింగ్‌తో ఇబ్బంది పెట్టగలడని కొందరు అభిమానులు అభిప్రాయపడుతున్నారు. డివిలియర్స్ 2021 నవంబర్‌లో ఐపీఎల్‌తో పాటు అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్‌లో 184 మ్యాచ్‌లు ఆడి 5,162 పరుగులు చేశాడు. ఇందులో ఆర్‌సీబీ తరఫున చేసిన పరుగులు 4,491. 2027 ఫిబ్రవరిలో 43 ఏళ్లు పూర్తి చేసుకోనున్న డివిలియర్స్ మళ్లీ ఐపీఎల్‌లోకి వస్తాడా లేదా అన్నది ఇంకా తేలలేదు. ప్రస్తుతానికి మాత్రం అతడి తాజా శతకం అభిమానుల్లో పాత జ్ఞాపకాలను, కొత్త ఆశలను రేకెత్తించింది.

