కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని మంజులాపూర్ (Manjulapur) ప్రాంతం విగ్రహాల తయారీకి ప్రత్యేక గుర్తింపు పొందింది. ఇక్కడి కళాకారులు రూపొందిస్తున్న దుర్గామాత విగ్రహాలు (Durga Mata Idols) భక్తులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. గణేశ్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మంజులాపూర్‌లో తయారైన వినాయక విగ్రహాలు నిర్మల్ నుంచి వివిధ జిల్లాలతోపాటు ఆంధ్రప్రదేశ్, బెంగళూరు ప్రాంతాలకు తరలివెళ్లాయి. వినాయక చవితి ఉత్సవాలు ముగియడంతో కళాకారులు ఇప్పుడు దుర్గామాత విగ్రహాల తయారీలో నిమగ్నమయ్యారు. అమ్మవారి ప్రతిమలకు తుది మెరుగులు దిద్దుతూ దేవీ నవరాత్రి ఉత్సవాలకు సిద్ధం చేస్తున్నారు. సుమారు ఐదు నుంచి పది అడుగుల ఎత్తులో వివిధ ఆకృతులు, రూపాల్లో దుర్గామాత విగ్రహాలను తీర్చిదిద్దుతున్నారు.
అమ్మవారి ముఖకవళికలు, ఆభరణాలు, వస్త్రాలంకరణ, సింహవాహనం వంటి అంశాలను ప్రత్యేక శ్రద్ధతో రూపొందిస్తున్నారు. భక్తుల అభిరుచులకు అనుగుణంగా విభిన్న రూపాల్లో విగ్రహాలను తయారు చేస్తుండటంతో వాటికి మంచి ఆదరణ లభిస్తోంది. ఇప్పటికే మండపాల నిర్వాహకులు అమ్మవారి విగ్రహాలను ముందస్తుగా బుకింగ్ చేసుకున్నారు. దేవీ నవరాత్రి ఉత్సవాలు సమీపిస్తుండటంతో మంజులాపూర్‌లోని విగ్రహ తయారీ కేంద్రాలు కళాకారుల పనులతో సందడిగా మారాయి. అమ్మవారి విగ్రహాలకు తుది మెరుగులు దిద్దుతూ ఉత్సవాల కోసం సిద్ధం చేస్తున్నారు.

