ఈసీ వివాదం.. కేంద్రం సంచలన నిర్ణయం!

కలం, వెబ్ డెస్క్ : చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌(Gyanesh Kumar)కు వ్యతిరేకంగా దాదాపు వారం రోజులుగా దేశవ్యాప్తంగా వివిధ రూపాల్లో నిరసనలు జరుగుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షం మూడు రోజుల పాటు తీవ్ర స్థాయిలో నిరసన చేపట్టింది. చివరకు రాష్ట్రపతిని కలిసి నాలుగు ప్రధాన అంశాలపై మెమొరాండం సమర్పించింది. మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ (CJP) సైతం పూణె, బెంగళూరు నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేసింది. తాజాగా అక్టోబరు 10న జంతర్ మంతర్ ప్రదర్శనకు పిలుపునిచ్చింది. కానీ కేంద్ర ప్రభుత్వం దాదాపు 35 వేల మంది పోలీసులను కేవలం సెంట్రల్ ఢిల్లీ ప్రాంతంలోనే మోహరించింది. నిర్బంధం, అణచివేతలతో ఆందోళనలను అడ్డుకోగలిగినా ఈ సమస్యకు ముగింపు ఎలా అనే అంశం కేంద్ర ప్రభుత్వానికి మింగుడు పడడంలేదు. ఎట్టి పరిస్థితుల్లో చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌తో రాజీనామా చేయించే ప్రసక్తే లేదని బీజేపీ స్పష్టమైన అభిప్రాయంతోనే ఉన్నది. దీనికి ప్రత్యామ్నాయంపై మేధోమధనం చేసింది. చివరకు మొత్తం ఎలక్షన్ కమిషన్ (Election Commission) టీమ్‌నే పక్కకు పెట్టడం ఉత్తమంగా ఉంటుందనే మాటలు బీజేపీ కేంద్ర వర్గాల నుంచి వినిపిస్తున్నాయి.

ముగ్గురు కమిషనర్లనూ నియమించే ఆలోచన :

ఇప్పుడు ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లను ఒకేసారి తొలగించి కొత్తగా మరో టీమ్‌ను నియమించడంపై కసరత్తు జరుగుతున్నది. ప్రధాన ప్రతిపక్షానికి తలొగ్గిందనే అపవాదు రాకుండా బీజేపీ ఈ తరహాలో ఆలోచన చేస్తున్నది. ఎలక్షన్ కమిషనర్ల నియామకంలో ఇంతకాలం బీజేపీ అనుసరించిన విధానానికి భిన్నంగా ఈసారి వ్యవహరించాలని భావిస్తున్నది. ఇప్పటివరకూ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నియామకంలో ప్రధానమంత్రి, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, ప్రధాని అపాయింట్ చేసే ఒక కేంద్ర మంత్రి సభ్యులుగా ఉండే సెలక్షన్ ప్యానెల్ ఏర్పడింది.

గతంలో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కూడా ఆ ప్యానెల్‌లో ఉన్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆ స్థానంలో కేంద్ర మంత్రికి చోటు కల్పించింది. ఇకపైన పాత పద్ధతినే అనుసరించడం ఉత్తమమనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. దీంతో ఇప్పుడున్న ముగ్గురు కమిషనర్లను తొలగించి కొత్తగా మరో టీమ్‌ను ఎంపిక చేసేవైపు పావులు కదులుతున్నాయి. ఆ ప్యానెల్‌లో చీఫ్ జస్టిస్ కూడా సభ్యులుగా ఉంటున్నందున లీగల్‌గా వచ్చే ఇబ్బందులకు సైతం ఒకింత రిలీఫ్ ఉంటుందన్నది బీజేపీ ఉద్దేశం.

మిగిలిన డిమాండ్ల విషయంలో నో క్లారిటీ :

రాష్ట్రపతిని కలిసిన పదిమంది బృందం నాలుగు ప్రధాన డిమాండ్లను పెట్టింది. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయడం, ప్రస్తుతం జరుగుతున్న మొత్తం ‘సర్’ ప్రక్రియను నిలిపివేయడం, గడచిన రెండు సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికలను రద్దు చేయడం, ఇకపైన ఈవీఎంలకు బదులుగా బ్యాలెట్ పేపర్లను ప్రవేశపెట్టడం.. ఈ నాలుగు డిమాండ్లపై కేంద్ర ప్రభుత్వం ఎలాంటి వైఖరి తీసుకుంటుందనే సస్పెన్స్ కొనసాగుతున్నది.

సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా డిమాండ్ మాత్రం ఒకేసారి ముగ్గురు కమిషనర్లను తప్పించడంతో పరిష్కారమవుతుందని బీజేపీ భావిస్తున్నా మిగిలిన మూడు డిమాండ్లకు ప్రధాన ప్రతిపక్షానికి ఎలాంటి సమాధానం ఇవ్వాలి.. ఎలాంటి వైఖరి అవలంబించాలి.. ఇకపైన నిరసనలు కొనసాగకుండా ఎలాంటి వ్యూహాన్ని రూపొందించాలి.. ఇలాంటి వాటికి క్లారిటీ రావాల్సి ఉన్నది. ఒకవైపు కాంగ్రెస్ నేతృత్వంలోని ‘ఇండియా’ కూటమి నిరసనలు, మరోవైపు కాక్రోచ్ జనతా పార్టీ ఆందోళనలు దీర్ఘకాలం కొనసాగకుండా ఎక్కడో ఒక చోట ఫుల్‌స్టాప్ పెట్టాలన్న ఆలోచనలో భాగంగానే ముగ్గురు ఎలక్షన్ కమిషనర్లను తప్పించేలా ఒక ప్లాన్ తెరమీదకు వచ్చింది. ఇక నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరం.

Also Read : రష్యాతో డీజిల్ డీల్: ట్రంప్ సంచలన నిర్ణయం!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>