కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం నగరంలోని దానవాయిగూడెం (Danavaigudem) కు చెందిన లారీ యజమాని అర్వపల్లి వెంకన్న (57) బలవన్మరణానికి పాల్పడ్డారు. లారీకి మూడు వాయిదాలు (ఈఎంఐ) చెల్లించలేదనే కారణంతో ఓ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది తీవ్రంగా ఒత్తిడి తేవడంతో పాటు, లారీని స్వాధీనం చేసుకుంటామని హెచ్చరించారు. దీంతో ఆయన తీవ్ర మనోవేదనకు గురై లారీకి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు.
ఈ ఘటనకు సంబంధించి మృతుని కుమారుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫైనాన్స్ సంస్థల ఒత్తిళ్లతోనే వెంకన్న ప్రాణాలు కోల్పోయాడని, సంఘటనపై పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనపై టౌన్ లారీ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధులు కృష్ణకుమారి, శ్రీనివాసరావు స్పందిస్తూ.. ప్రభుత్వం, సంబంధిత అధికారులు స్పందించి బాధిత కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

