కలం, వెబ్ డెస్క్ : దేశ వ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలకు బాధ్యత వహిస్తూ ఎన్నికల ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలనే డిమాండ్‌తో ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల (YS Sharmila) ఆధ్వర్యంలో ఇండియా కూటమి నేతలు చేపట్టిన ‘ఛలో రాజ్‌భవన్’ నిరసన కార్యక్రమం విజయవాడలో ఉద్రిక్తతకు దారితీసింది. విజయవాడలోని లెనిన్ సెంటర్ నుండి రాజ్‌భవన్‌కు నిర్వహించ తలపెట్టిన ‘ఛలో రాజ్‌భవన్’ మార్చ్ కు పోలీసులు అనుమతి ఇవ్వలేదు.
ఈ క్రమంలోనే ఈ నిరసనను అడ్డుకునేందుకు పోలీసులు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పలువురు ఇండియా కూటమి నేతల నివాసాల వద్ద మోహరించారు. గన్నవరం మండలం కేసరపల్లిలోని ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల నివాసం వద్ద కూడా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసి ఆమెను హౌస్ అరెస్ట్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని రక్షించుకోవడానికి తాము చేపడుతున్న శాంతియుత నిరసనలను పోలీసులు అణచివేస్తున్నారంటూ కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు.

