తెలంగాణలో భూముల సమగ్ర రీసర్వే షురూ.. మంత్రి కీలక ఆదేశాలు!

కలం, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా మొదలైన భూముల రీసర్వే (Land Resurvey) ప్రక్రియను ఏడాదిన్నరలోగా పూర్తి చేయాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు పూర్తి చేసేలా రోడ్ మ్యాప్‌ రూపొందించింది. ప్రస్తుతం నక్షాలు లేని 345 గ్రామాలు, హైదరాబాద్ మినహా మిగిలిన 32 జిల్లాల్లో 70 గ్రామాల చొప్పున మొత్తం 2,768 గ్రామాల్లో రీసర్వే చేసేలే షెడ్యూల్ తయారైంది. రాష్ట్రం మొత్తాన్ని ఏడు జోన్లుగా విభజించి, ప్రతి జోన్‌కు ఇద్దరు (ఒకరు రెవెన్యూ, మరొకరు సర్వే డిపార్టుమెంట్) చొప్పున ప్రత్యేక అధికారులను నియమిస్తున్నట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు.

ఆ డిపార్టుమెంట్ అధికారులతో, సర్వే పర్యవేక్షణకు నియమితులైన ఆఫీసర్లతో సెక్రటేరియెట్‌లో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ‘‘రాష్ట్రంలో 125 ఏండ్ల కింద భూముల సర్వే జరిగింది. ఇప్పుడు మళ్లీ సమగ్రంగా జరుగుతున్నది. ఇది భవిష్యత్తులో భూవివాదాలకు తావులేని తీరులో పారదర్శకంగా, పకడ్బందీగా జరగాలి. నాణ్యత, పారదర్శకత, వేగం.. ఈ మూడు అంశాల ప్రాతిపదికన నిర్వహించాలి” అని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

నవంబర్‌‌లో ఫస్ట్ ఫేజ్ కంప్లీట్

తెలంగాణను భూవివాదాల్లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా రీసర్వే చేపట్టామని, భూసమస్యలకు శాశ్వత పరిష్కారం చూపించడమే ప్రధాన లక్ష్యమని పొంగులేటి తెలిపారు. అధికారులంతా బాధ్యతాయుతంగా పని చేయాలని సూచించారు. ‘‘రీసర్వేను క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించేందుకు ఏడు జోన్లకు 14 మంది స్పెషల్ ఆఫీసర్లను నియమించాం. సర్వే జరుగుతున్న తీరును, ప్రజల స్పందనను ఎప్పటికప్పుడు పరిశీలించి స్థానిక ప‌రిస్ధితుల‌కు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోవాలి. ఇప్పటివ‌ర‌కు 245 గ్రామాల్లో స‌ర్వే పూర్తయింది. ఫస్ట్ ఫేజ్‌ను వచ్చే నెల చివరి నాటికే పూర్తి చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నాం. ప్రతి మండలంలో కనీసం రెండు రెవెన్యూ గ్రామాల్లో సర్వే తప్పనిసరిగా జరగాలి. ప్రతి మండలానికి రెండు సర్వే బృందాలను ఏర్పాటు చేశాం. ఒక్కో బృందంలో లైసెన్స్‌డ్‌ సర్వేయర్‌, జీపీవో (గ్రామ పాలనాధికారి), డిప్యూటీ తహసీల్దార్‌ లేదా ఆర్‌ఐ (రెవెన్యూ ఇన్‌స్పెక్టర్), సీనియర్‌ అసిస్టెంట్‌, జూనియర్‌ అసిస్టెంట్‌ తదితర సిబ్బంది ఉంటారు” అని వివరించారు.

ప్రతి వారం సమీక్ష

సర్వే జరుగుతున్న ప్రాంతాల్లో ప్రతిరోజు తహసీల్దార్‌ పరిశీలించాలని పొంగులేటి ఆదేశించారు. ఈరోజు ఎక్కడ సర్వే జరిగింది? ఎన్ని ఎకరాలు కంప్లీట్ అయింది? ఎన్ని సర్వే నంబర్లు పూర్తయ్యాయి? ఎన్ని గ్రామాల్లో జరుగుతున్నది? ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తున్నది? సర్వేలో ఏమైనా సమస్యలు ఎదురవుతున్నాయా?.. ఇలాంటి అంశాలపై అధికారులు ప్రతిరోజూ స్పష్టమైన సమాచారాన్ని సేకరించాలని సూచించారు. చిన్న పొరపాటుకు కూడా తావులేకుండా, భవిష్యత్తులో భూవివాదాలకు అవకాశమే లేకుండా రీసర్వే జరగాలని స్పష్టం చేశారు. దీనిపై ప్రతి వారం రాష్ట్రస్థాయిలో అధికారులు సమీక్ష నిర్వహించాలని, ప్రతి 15 రోజులకు స్వయంగా తానే సమీక్షించి పురోగతిని పరిశీలిస్తానని తెలిపారు. ప్రభుత్వ భూముల సర్వే సమయంలో సరిహద్దులను గుర్తించే ప్రక్రియలో సంబంధిత శాఖల అధికారులు తప్పనిసరిగా హాజరుకావాల‌ని ఆదేశించారు.

హైదరాబాద్‌లో డాష్‌బోర్డు

రీసర్వేను రాష్ట్రస్థాయి నుంచి నిరంతరం పర్యవేక్షించేందుకు హైదరాబాద్‌లో ప్రత్యేక డాష్‌ బోర్డు ఏర్పాటు చేయాలని అధికారుల‌ను పొంగులేటి ఆదేశించారు. సర్వే పురోగతి, రోజువారీ పనితీరు, గ్రామాల వారీగా పూర్తయిన సర్వే, పని చేస్తున్న సర్వే బృందాలు, ఉపయోగిస్తున్న రోవర్లు, వాటి లొకేషన్‌.. ఇలాంటి వివరాలన్నీ డాష్‌బోర్డులో రియల్‌టైమ్‌లో కనిపించేలా టెక్నాలజీని వినియోగించాలని సూచించారు. సర్వేకు అవసరమైన సర్వేయర్లు, రోవర్లు, సర్వర్లు, ఇతర సాంకేతిక పరికరాలు, కొరత ఉన్నట్లయితే వెంటనే కొనుగోలు చేయడం… వీటన్నింటినీ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు తెలయజేయాలన్నారు. ప్రభుత్వం నుంచి నిధుల కొరతే ఉండదని స్పష్టం చేశారు. రీసర్వే పేరుతో స్థానికంగా ఎవరైనా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని హెచ్చరించారు. ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా వ్యవహరించే సిబ్బందిపై కఠిన చర్యలు తప్పవన్నారు.

ఎర్రవల్లి భూముల లెక్క తేలుస్తాం

ఎర్రవల్లిలోని సర్వే నెంబర్ 325లో ఇటీవల సర్వే నిర్వహించారని, అందులో 45 ఎకరాలు తక్కువగా ఉన్నట్టు తేలిందని తెలిపారు. ఈ తేడా కారణంగా మరోసారి సర్వే నిర్వహించేలా నోటీసులు ఇచ్చామన్నారు. ‘‘ఎర్రవల్లిలో అసైన్డ్ భూములు కొన్ని చేతులు మారాయి. వాటిని గుర్తించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అమరవీరులను గుర్తించి వారికి న్యాయం చేస్తాం. ఎవరి ప్రైవేట్ భూముల్లోనైనా నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా అసైన్డ్ ల్యాండ్ ఉంటే వాటిని పేద‌ల‌కు పంచుతాం” అని చెప్పారు. మీడియాతో చిట్‌చాట్ సందర్భంగా ఈ అంశాన్ని ప్రస్తావించారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>