కలం, ఖమ్మం బ్యూరో : తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతికి ప్రతీక అయిన బతుకమ్మ పండుగ (Bathukamma Festival) పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) ఆరోపించారు. శనివారం నుంచి ప్రారంభం కానున్న బతుకమ్మ సంబరాల సందర్భంగా ఆయన ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో బతుకమ్మను రాష్ట్ర పండుగగా గుర్తించి, వైభవంగా నిర్వహించడంతో పాటు మహిళలకు చీరలను పంపిణీ చేశారని గుర్తుచేశారు. అయితే ప్రస్తుతం ప్రభుత్వ ప్రోత్సాహం తగ్గడంపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఉందని అన్నారు. తెలంగాణ పండుగల పట్ల ప్రభుత్వం అలసత్వం వహిస్తే ప్రజలు హర్షించరని పువ్వాడ అజయ్ కుమార్ హెచ్చరించారు. ఆడపడుచులంతా బతుకమ్మ వేడుకలను ఆనందోత్సాహాల నడుమ ఘనంగా జరుపుకోవాలని కోరారు.

