కలం, కరీంనగర్: కరీంనగర్ నగరపాలక సంస్థ(Karimnagar Corporation)పై పీఠం ఎక్కి 8 నెలలు గడుస్తున్నా.. బీజేపీ పాలకవర్గం సాధించింది శూన్యమని జిల్లా బీఆర్‌ఎస్ శ్రేణులు మండిపడుతున్నాయి. కేంద్రంలో అధికారంలో ఉన్నామని, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్నామని ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తున్న కమలనాథులు.. నగరానికి ప్రత్యేకంగా తెచ్చిన ఒక్క రూపాయి నిధి ఏంటో బహిరంగంగా చెప్పాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు. కరీంనగర్‌లోని నక్షత్ర హోటల్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో బీఆర్‌ఎస్ నగర శాఖ అధ్యక్షులు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ రవీందర్ సింగ్ (Ravinder Singh) గళం విప్పారు.
కమలనాథుల్లో వణుకు..
కరీంనగర్ నగరంలో గులాబీ కండువా ధరించేందుకు యువత పోటీ పడుతుండటంతో బీజేపీ నాయకుల్లో గుబులు మొదలైందని రవీందర్ సింగ్ (Ravinder Singh) ఎద్దేవా చేశారు. మాజీ మంత్రి, స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ అభివృద్ధి పాలన, ఆయన నాయకత్వంపై అపార నమ్మకంతోనే కిసాన్‌నగర్‌కు చెందిన సుమారు 150 మంది యువకులు స్వచ్ఛందంగా బీఆర్‌ఎస్ పార్టీలోకి క్యూ కట్టారని తెలిపారు. యువత చేరికలతో బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నిండితే.. అధికార పార్టీ నేతల్లో మాత్రం వణుకు పుట్టిందని, అందుకే మరుసటి రోజే హడావుడిగా డీలా పడిన ముఖాలతో ర్యాలీలు నిర్వహించాల్సి వచ్చిందని ఎద్దేవా చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం, గత బీఆర్‌ఎస్ హయాంలో మంజూరైన అభివృద్ధి పనులకు తామే మోక్షం కల్పించామంటూ సిగ్గులేకుండా బీజేపీ నేతలు డబ్బాలు కొట్టుకుంటున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో బీజేపీకి చెందిన కార్పొరేటర్లు సైతం కమలం పార్టీని వీడి బీఆర్‌ఎస్ గూటికి చేరేందుకు సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు.
దమ్ముంటేప్రమాణం చేయాలని సవాల్
నగరంలో చేపట్టిన ప్రతిష్టాత్మక ‘స్మార్ట్ సిటీ’ ప్రాజెక్టు నిధులను కేంద్ర మంత్రి బండి సంజయే తెచ్చినట్లు బీజేపీ నాయకులు ఊదరగొడుతున్నారని మాజీ మేయర్ రవీందర్ సింగ్ మండిపడ్డారు. దమ్ముంటే దీనిపై బండి సంజయ్ దుర్గామాత వద్దకు వచ్చి ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. చేతకాని తనంతో కేవలం ప్రెస్‌మీట్లు, అబద్ధపు ప్రచారాలకే బీజేపీ పరిమితమైందని ధ్వజమెత్తారు. నగర ప్రజల సమస్యలను గాలికొదిలేసి, కేవలం రాజకీయ లబ్ది కోసం కుట్ర రాజకీయాలు చేయడం ఆ పార్టీ నేతల నైజంగా మారిందని మండిపడ్డారు.
గంగుల కమలాకర్‌పై విమర్శలా? సహించేది లేదు!
నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, కరీంనగర్‌ను రాష్ట్రంలోనే నంబర్ వన్ నగరంగా తీర్చిదిద్దిన ఘనత మాజీ మంత్రి గంగుల కమలాకర్‌దేనని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. రాజకీయంగా ఆయనను ఎదుర్కొనే దమ్ములేకనే కొందరు పనిగట్టుకుని వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారని హెచ్చరించారు.
బీసీ సామాజిక వర్గానికి చెందిన అగ్రనేతపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే కరీంనగర్ ప్రజలు, బీఆర్‌ఎస్ శ్రేణులు చూస్తూ ఊరుకోవని, తగిన రీతిలో బుద్ధి చెబుతామని తీవ్రంగా హెచ్చరించారు. రాజకీయ విమర్శలు విధానాలపై ఉండాలి తప్ప, వ్యక్తిగత దూషణలకు దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని స్పష్టం చేశారు.
’ఊసరవెల్లి’ రాజకీయాలు ప్రజలు సహించరు..
రాజకీయ ప్రయోజనాల కోసం ఏ పార్టీలో ఉంటే ఆ పార్టీని అమ్ముకోవడం, పదవుల కోసం పార్టీలు మారడం మాజీ మేయర్ సునీల్ రావుకే చెల్లుతుందని నేతలు తీవ్రస్థాయిలో విమర్శించారు. కాంగ్రెస్, బీఆర్‌ఎస్, బీజేపీ ఇలా అన్ని పార్టీలు తిరిగి అవకాశాలు అనుభవించిన ఆయన.. నగర అభివృద్ధి ప్రధాత గంగుల కమలాకర్‌ను విమర్శించడం దయ్యాలు వేదాలు వల్లించినట్లుగా ఉందని ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో కనీస నిబద్ధత, విశ్వసనీయత లేని ఇటువంటి ఊసరవెల్లి నాయకుల తీరును ప్రజలు గమనిస్తున్నారని, త్వరలోనే ప్రజలే వారికి తగిన గుణపాఠం చెబుతారని తేల్చిచెప్పారు.
ఈ మీడియా సమావేశంలో మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, కార్పొరేటర్లు గుగ్గిళ్ల జయశ్రీ శ్రీనివాస్, యూసుఫ్, అలీ, గాదె రూప, శ్రీనివాస్, జమ్ము, మాజీ కార్పొరేటర్లు, గందె మాధవి-మహేష్, ఎడ్ల అశోక్, ఐలందర్ యాదవ్, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, బిఆర్ఎస్ నాయకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.
Also Read : కాంగ్రెస్ ఎన్నికల హామీలపై కేటీఆర్ సెటైర్లు
Follow Us On : WhatsApp

