కలం, వెబ్‌డెస్క్: ఉత్తర్‌ప్రదేశ్ (Uttar Pradesh) లో ఓ విద్యార్థి గుండుపై తబలా వాయిస్తూ రీల్స్ చేసిన టీచర్‌కు ప్రభుత్వం షాకిచ్చింది. ఆయనను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇటావా జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. దినేశ్ కుమార్ మాథుర్ అనే వ్యక్తి స్థానిక ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నాడు. బడికి గుండు కొట్టుకొని వచ్చిన ఓ విద్యార్థి తలను తబలా లాగా తడుతూ, దాన్ని వీడియో రికార్డు చేసి దినేష్ ఫేస్‌బుక్ అకౌంట్‌లో పోస్ట్ చేశాడు. ఈ వీడియో వైరల్‌గా మారింది. ఇందులో ఆయన నవ్వుతూ విద్యార్థితో అలా ప్రవర్తించడం, చుట్టూ ఉన్న మిగతా పిల్లలు కూడా నవ్వడం తీవ్ర విమర్శలకు దారితీసింది.
ఈ ఘటనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. విద్యార్థులకు పాఠాలు చెప్పడం పోయి ఇదేం పని అంటూ నెటిజన్లు మండిపడ్డారు. ఇందుకే ప్రభుత్వ పాఠశాలలపై నమ్మకం తగ్గిపోతోందని కామెంట్ చేశారు. దీంతో ప్రాథమిక విద్యా శాఖాధికారి డాక్టర్ రాజేష్ కుమార్ తక్షణమే స్పందించి దినేష్ కుమార్‌ను సస్పెండ్ చేశారు. క్రమశిక్షణా రాహిత్యానికి పాల్పడినందున ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే ఈ ఘటనపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశించామన్నారు. విద్యార్థుల భద్రత, పాఠశాలల్లో ఉపాధ్యాయుల నైతిక ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి సారించామని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు.
Also Read : కేటీఆర్‌పై బల్మూరి వెంకట్ సంచలన ఆరోపణలు
Follow Us On : WhatsApp

