కలం, జగిత్యాల : జగిత్యాల జిల్లా ఏర్పడి పదేళ్లు పూర్తయిన సందర్భంగా ఈ నెల 12న జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ (Jagtial BRS ) ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, బహిరంగ సభ నిర్వహించనున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. గురువారం స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి టి. జీవన్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు, మాజీ జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
పార్టీ అధిష్టానం పిలుపు మేరకు 12న ఉదయం పాత బస్టాండ్ నుంచి ప్రారంభమయ్యే ర్యాలీ అంబేద్కర్ చౌరస్తా మీదుగా అంగడి బజార్ వరకు కొనసాగుతుందని, అనంతరం అక్కడ సమావేశం నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారులు, కళాకారులు, జేఏసీ ప్రతినిధులను ఘనంగా సన్మానించనున్నట్లు తెలిపారు. కేసీఆర్ పాలనలోనే జగిత్యాల జిల్లాగా ఏర్పడి కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయం, మెడికల్ కాలేజీల ఏర్పాటుతో వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. ఈ దశాబ్ది ఉత్సవాల్లో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి నియోజకవర్గాలతో పాటు అన్ని మండలాల ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

