కలం, కరీంనగర్: తెలంగాణలో ఓటర్ల జాబితా సవరణ (Telangana Voter List Revision) ప్రక్రియ తీవ్ర అనుమానాలకు తావిస్తోందని, రాష్ట్రంలో దాదాపు 95 లక్షల ఓట్లు (27.8%) తగ్గడంపై ఎన్నికల సంఘం వెంటనే స్పష్టత ఇవ్వాలని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు, సుడా మాజీ ఛైర్మన్ జీ.వి. రామకృష్ణ రావు డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
గతంలో 3.38 కోట్లుగా ఉన్న ఓటర్ల సంఖ్య ఒక్కసారిగా 2.43 కోట్లకు పడిపోవడంపై (GV Ramakrishna Rao) ఆందోళన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర (21.1%), కర్ణాటక (19.5%), ఉత్తరప్రదేశ్ (13.2%), ఏపీ (10.8%) వంటి ఇతర రాష్ట్రాలతో పోలిస్తే, ఒక్క తెలంగాణలోనే దేశంలోనే అత్యధికంగా ఓటర్ల కోత విధించడం వెనుక ఉన్న అసలు కారణాలను ప్రజల ముందుంచాలన్నారు. ఈ సందర్భంగా ఈసీకి ఆయన పలు ప్రశ్నలు సంధించారు.
95 లక్షల ఓట్ల తొలగింపుకు సంబంధించి జిల్లాలు, నియోజకవర్గాలు, పోలింగ్ కేంద్రాల వారీగా వివరాలను వెంటనే బయటపెట్టాలని అన్నారు. మరణాలు, వలసలు, డూప్లికేట్ ఓట్ల వర్గీకరణను స్పష్టంగా వెల్లడించాలని, ఓట్లు తొలగించే ముందు సదరు ఓటర్లకు ముందస్తు నోటీసులు ఇచ్చారో లేదో తెలపాలని డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యంలో అర్హుడైన ఏ ఒక్కరూ ఓటు హక్కు కోల్పోకూడదని, పారదర్శకత కోసం వెంటనే ఈ తొలగింపుల వివరాలన్నింటినీ బహిర్గతం చేయాలని జీ.వి. రామకృష్ణ రావు డిమాండ్ చేశారు.

