కలం, వెబ్ డెస్క్ : విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్లో జరిగిన గాదె సాయి కృష్ణ (Sai Krishna) కస్టోడియల్ డెత్ కేసులో సిట్ (SIT) కోర్టుకు కీలక ఆధారాలతో కూడిన ఛార్జ్ షీట్‌ను సమర్పించింది. పోలీసుల వేధింపులు, తీవ్రమైన కస్టోడియల్ టార్చర్ వల్లే సాయి కృష్ణ ప్రాణాలు కోల్పోయాడని నిర్ధారిస్తూ కోర్టులో 86 పేజీల ప్రధాన చార్జ్‌షీట్‌ను, 263 రకాల కీలక ఆధారాలను సిట్ అధికారులు అందజేశారు. మార్కాపురం నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్ ద్వారా విజయవాడకు తీసుకువచ్చినప్పటి నుంచి సాయి కృష్ణ మరణించే వరకు జరిగిన ఘటనలను నివేదికలో వివరించారు.
స్టేషన్లో సీఐ నాగరాజుతో పాటు మరో ఏడుగురు నిందితులు సాయి కృష్ణపై దారుణంగా భౌతిక దాడులు చేశారని, మర్మాంగాల్లో గాయాలు కావడంతోనే అతడు ప్రాణాలు వదిలాడని సిట్ తేల్చింది. బాధితుడి ఆరోగ్యం క్షీణించడంతో పాత భవనానికి తరలించి, అతడు మరణించాడని నిర్ధారించుకున్నాక మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి అర్ధరాత్రి వేళ దహనం చేశారని పేర్కొంది.
ఈ ఘోరాన్ని కప్పిపుచ్చేందుకు లాకప్ డైరీ, జనరల్ డైరీ, సెంట్రీ బుక్‌లలో వివరాలు నమోదు చేయకపోవడం, సీసీటీవీ ఫుటేజ్ మాయం చేయడం, స్టేషన్‌కు కొత్తగా పెయింట్లు వేయించడం, లాకప్‌ను కడిగేయడం వంటి అనేక ఆధారాల ధ్వంసానికి పాల్పడ్డారని వివరించింది. మొత్తం 120 మంది సాక్షులను విచారించి ఆధారాలు సేకరించిన సిట్, ఈ కేసులో తదుపరి విచారణ కొనసాగుతోందని స్పష్టం చేసింది.

