కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ (Karimnagar)లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య మధ్య మాటల తూటాలు, పోటాపోటీ నిరసనలతో పొలిటికల్ వార్ ముదురుతోంది. ఎమ్మెల్యే గంగుల కమలాకర్, కేంద్ర మంత్రి బండి సంజయ్ వర్గాల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. దీనికి ప్రధాన కారణం కిసాన్ నగర్‌లో జరిగిన కార్యక్రమం. 28, 29, 30 డివిజన్ల నుంచి సుమారు 150 మంది యువకులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ సమక్షంలో బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడంతో ఈ వివాదానికి తెరలేచింది. తమ కంచుకోటగా భావించే కిసాన్ నగర్‌లో బీఆర్ఎస్ ఎంటర్ అయి, చేరికలు సైతం మొదలుపెట్టడంతో బీజేపీ శ్రేణులు తక్షణమే రంగంలోకి దిగాయి.
బైక్ ర్యాలీతో హల్చల్..
బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిని మల్లేశం, డిప్యూటీ మేయర్ సునీల్ రావు నేతృత్వంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించి హల్చల్ చేశారు. కిసాన్ నగర్ నుండి చింతల వరకు వందలాది బైక్‌లతో భారీ ర్యాలీ నిర్వహించి తమ బలాన్ని చాటారు. కిసాన్ నగర్ గడ్డ.. బండి సంజయ్ అడ్డా అని నినదించారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ఏమీ చేయని గంగుల కమలాకర్ ఒక ‘అవినీతి అనకొండ’ అంటూ ధ్వజమెత్తారు. ఐటీ టవర్‌లో తొండలు గుడ్లు పెడుతున్నాయని, మానేరు రివర్ ఫ్రంట్ పేరుతో ప్రజలను మోసం చేశారని ఎద్దేవా చేశారు.
ఫ్లెక్సీల ఏర్పాటుతో రచ్చ రచ్చ..
కిసాన్ నగర్‌లో ఎమ్మెల్యే గంగులను కించపరిచేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ శ్రేణులు భగ్గుమన్నాయి. బీఆర్ఎస్ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్, మాజీ మేయర్ సర్దార్ రవీందర్ సింగ్ ఆధ్వర్యంలో నాయకులు మూడో పట్టణ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన చేపట్టారు. సీఐకి రాతపూర్వక ఫిర్యాదు చేశారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసినవారిపై కఠిన తీసుకోవాలన్నారు. మొత్తానికి కిసాన్ నగర్‌లో చోటు చేసుకున్న చేరికలు బీజేపీ ర్యాలీ, ఫ్లెక్సీల వివాదం, బీఆర్ఎస్ ధర్నా వంటి ఘటనలతో కరీంనగర్‌లో ఒకరకమైన ఉత్కంఠ వాతావరణం నెలకొంది.

