కలం, జోగులాంబ గద్వాల: బడిలో అక్షరాలు దిద్దాల్సిన బాల్యం కూలీ (Child Labour) పనులు చేస్తూ దుర్భర జీవితం గడుపుతోంది. పేదరికమో, ఇతర కారణాలో తెలియదు కానీ.. పదేండ్ల వయస్సులోనే కూలీ అవతారమెత్తుతున్నారు. ఈ నేపథ్యంలో పనుల కోసం ఆటో ఎక్కితే గమ్యస్థానం చేరుతామో లేదో తెలియని భయాందోళనకర వాతావరణం నెలకొంది. సామర్థ్యానికి మించి కూలీలను, బడి పిల్లలను కుక్కి తరలిస్తుండటంతో నిత్యం ఎక్కడో ఒక చోట రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ఆటో, బోలేరో వాహనాల్లో సైతం మనుషులను గొర్రెల మందలా తరలిస్తున్నా కట్టడి చేయాల్సిన అధికార యంత్రాంగం మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రమాదాలు జరిగినప్పుడు హడావుడి చేయడం, ఫైన్లు వేసి మరుసటి రోజే చేతులు దులుపుకోవడం సర్వసాధారణంగా మారింది.
ఆపరేషన్ ముష్కాన్ ప్రచారానికేనా?
బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించేందుకు ప్రభుత్వం నిర్వహిస్తున్న “ఆపరేషన్ ముష్కాన్” లాంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో సత్పాలితాలను ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బడికి వెళ్లి చదువుకోవాల్సిన లేత చేతులు పత్తి, మిరప తోటల్లో కూలీ పనులకు పరిమితమవుతున్నాయి. జిల్లాలో (Jogulamba Gadwal) ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి, సరిహద్దు దాటించి పొరుగు రాష్ట్రాలకు వందలాది మంది చిన్నారులను రోజువారీ కూలీలుగా తరలిస్తున్నా అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు.
చర్యలు శూన్యం
కేవలం కాగితాల్లో లెక్కలు చూపిస్తూ, తూతూమంత్రంగా దాడులు చేసి రికార్డులు భర్తీ చేయడం తప్ప క్షేత్రస్థాయిలో అక్రమ రవాణాను ఆపేందుకు శాశ్వత చర్యలు శూన్యం. ప్రమాదాల పరంపర కొనసాగుతున్న తరుణంలో తక్షణమే యంత్రాంగం నిద్రమత్తు వీడి దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. పోలీసు, రవాణా, కార్మిక శాఖల అధికారులు ఉమ్మడి టాస్క్ఫోర్స్ (Taskforce) బృందాలుగా ఏర్పడి రోజువారీ తనిఖీలు చేపట్టాలి. చిన్నారులను కూలీలుగా తరలిస్తున్న ఏజెంట్లు, వాహన యజమానులపై కేసులు నమోదు చేయాలి. విడిపించిన బాలకార్మికులను తిరిగి బడుల్లో చేర్పించి, వారికి ఉచిత విద్యను అందించడమే ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం.

