కలం, కరీంనగర్ బ్యూరో: కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ (MLA Gangula Kamalakar)ను కించపరిచేలా కిషన్‌నగర్‌లో అనుచిత ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని పార్టీ నగర అధ్యక్షుడు చల్లా హరిశంకర్ కరీంనగర్ మూడో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా కొద్దిసేపు పోలీస్‌స్టేషన్ ఎదుట బైఠాయించి నిరసన తెలిపారు. చల్లా హరిశంకర్ మాట్లాడుతూ.. నగరంలోని 28, 29, 30 డివిజన్లకు చెందిన సుమారు 150 మంది పెద్ద సంఖ్యలో బీజేపీ, కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్‌లో చేరడాన్ని కొందరు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు.
రెచ్చగొట్టేలా పోస్టులు…
కిషన్‌నగర్ యువత గంగుల కమలాకర్ నాయకత్వంపై నమ్మకంతో స్వచ్ఛందంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుని బీఆర్ఎస్‌లో చేరారని చల్లా హరిశంకర్ తెలిపారు. నగరంలో బీఆర్ఎస్‌కు పెరుగుతున్న ఆదరణను చూసి తట్టుకోలేక ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడుతున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్‌లో చేరిన కుటుంబాలను బెదిరించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ ఛైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, మాజీ మేయర్ సర్ధార్ రవీందర్ సింగ్, మాజీ కార్పొరేటర్లు గందె మహేష్, ఐలేందర్ యాదవ్, ఎడ్ల అశోక్ పాల్గొన్నారు.

