కలం, జోగులాంబ గద్వాల: టీబీ వ్యాధిపై అవగాహనతో ప్రతి ఒక్కరూ టీబీ రహిత గద్వాల కోసం కృషి చేయాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwanbasha Shaik) అన్నారు. గురువారం ఢిల్లీలో కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఇతర అతిథులతో కలిసి ‘టీబీ ముక్త భారత్ అభియాన్ కోసం’ నినాదంతో జోష్ (జాయింట్ స్క్వార్డ్ ఫర్ హెల్త్) కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా గద్వాలలోని ఐడీఓసీ మినీ సమావేశపు మందిరంలో జోష్ కార్యక్రమాన్ని కలెక్టర్ జిల్లా అధికారులతో కలిసి తిలకించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ.. టీబీ వ్యాధి సోకిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు ప్రబలకుండా అవగాహనతో వ్యవహరించాలని సూచించారు. వ్యాధి సోకిన వ్యక్తులు అవసరమైన మందులు వాడడమే కాక మంచి పౌష్టికాహారం తీసుకోవాల్సిన అవసరం ఉన్నందున ఎవరైనా సరే దాతలు న్యూట్రి ఫుడ్ అందించేందుకు ముందుకు రావాలని కోరారు.
టీబీ లక్షణాలు ఉన్న వ్యక్తులు సమీపంలోని వైద్యశాలలలో X-ray పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. వ్యాధి వ్యాప్తిని అరికట్టేందుకు జిల్లాలోని ఎన్సిసి, ఎన్ఎస్ఎస్, మై భారత్ వాలంటీర్లు, స్నేహ గ్రూపుల సభ్యులు కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి మండలానికి ఒక టీబి పేషంట్ ను ఎంపీడివోలు దత్తత తీసుకొని వారికి అన్ని విధాల ఆదుకోవాలని అన్నారు. అనంతరం జిల్లాలోని ఖమ్మంపాడు, కోదండపురం, బస్వాపురం, ఇటిక్యాలపాడు, గుర్రం గడ్డ టిబి ముక్త గ్రామ పంచాయతీలుగా ఎంపికైనందున సంబంధిత గ్రామాల సర్పంచులకు కలెక్టర్ జ్ఞాపికలను అందజేశారు. కార్యక్రమంలో డిఎంహెచ్వో సంధ్య కిరణ్మయి, డిప్యూటీ డిఎంహెచ్వో అస్గర్ అలీ, ఇన్చార్జి డివైఎస్ఓ రామలింగేశ్వర గౌడ్, రెడ్ క్రాస్ జిల్లా చైర్మన్ అయ్యపూ రెడ్డి, టీబీ ప్రోగ్రాం అధికారి రాజు, వివిధ మండలాల ఎంపీడీవోలు, పలువురు సర్పంచులు, ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

