కలం, జోగులాంబ గద్వాల: అధికార కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు రిజర్వాయర్ల కెపాసిటీ పెంచుతామని ఆర్భాటం చేస్తూ తమ సొంత జేబులు నింపుకునేందుకు ప్రయత్నిస్తున్నారని మహబూబ్నగర్(Mahabubnagar) ఎంపీ డీకే అరుణ (DK Aruna) ఆరోపించారు. గురువారం గట్టు మండల కేంద్రంలో బీజేపీ సీనియర్ నాయకులు మధుసూదన్ ఆధ్వర్యంలో నిర్వహించిన పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశానికి డీకే అరుణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. గద్వాల నియోజకవర్గంలో ఎన్నో ఏండ్లుగా రిజర్వాయర్లు అసంపూర్తిగా ఉన్నాయన్నారు. రిజర్వాయర్లు, కాలువలలో తట్టెడు మట్టి కూడా తీయని నాయకులు మిగిలిన రెండేళ్లలో ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని నిలదీశారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకుంటున్న కాంగ్రెస్, కేవలం తమ పార్టీ నేతలు, కార్యకర్తలకు మాత్రమే ఇందిరమ్మ ఇళ్లను కేటాయిస్తోందని మండిపడ్డారు. గతంలో తాను మంత్రిగా పనిచేసిన సమయంలో ఎలాంటి రాజకీయాలు చూడకుండా అర్హులందరికీ ఇళ్లు అందించానని గుర్తు చేశారు.
పక్కదారి పడుతున్న నిధులు..
గద్వాల మున్సిపాలిటీలో కోట్ల రూపాయల టాక్స్లు వసూలు చేసి, లెక్కల్లో మాత్రం కేవలం లక్షల రూపాయలు చూపిస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని, ఇలాగే వదిలేస్తే గద్వాలను త్వరలోనే అమ్మేస్తారని హెచ్చరించారు. వర్షాల వల్ల జూరాల ప్రాజెక్టులోకి వచ్చిన వరద నీటిని, కర్ణాటక ప్రభుత్వం విడుదల చేసిన నీటిగా చిత్రీకరిస్తూ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలు డ్రామాలు ఆడారని దుయ్యబట్టారు. తెలంగాణకు కర్ణాటక ప్రభుత్వం చుక్క నీరు కూడా ఇవ్వలేదని, తమ హక్కుల కోసం ఆందోళన బాట పట్టిన రైతులపై కేసులు నమోదు చేయడం దారుణమని ధ్వజమెత్తారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీ డబ్బులతో ఓట్లను కొనుగోలు చేసి గద్వాలలో గెలిచిందని, ఇప్పుడు కాంగ్రెస్ మాయమాటలు చెప్పి అధికారంలోకి వచ్చిందని అరుణ ఎద్దేవా చేశారు. నాయకులు కేవలం సంపాదించుకోవడానికే ఎమ్మెల్యేలు అయ్యారనే భావనలో ఉన్నారని విమర్శించారు. ప్రజాదరణ కలిగిన బీజేపీ ప్రతి ఒక్కరి గుండెల్లో ఉందని, రాబోయే రోజుల్లో తెలంగాణలో అధికారంలోకి వచ్చేది తమ పార్టీయేనని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధా రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామచంద్రారెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ బండల వెంకటరాములు, జిల్లా ప్రధాన కార్యదర్శి రవికుమార్ ఎక్బోటే, జిల్లా ఉపాధ్యక్షుడు బలిగేర నల్లారెడ్డి, జిల్లా కోశాధికారి మీర్జాపురం రామచంద్రారెడ్డి, గద్వాల నియోజకవర్గ పోటీ చేసిన అభ్యర్థి బలిగేర శివారెడ్డి, రాష్ట్ర మహిళా అధికార ప్రతినిధి అక్కల రమాదేవి, బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బాబుల్ రెడ్డి, ఓబీసీ మోర్చా నాయకులు దాస్, మండల అధ్యక్షుడు గట్టు సురేష్, కౌన్సిలర్లు శాలన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

