ట్యాబ్‌లతో విద్యార్థుల లక్ష్యాల డిజిటల్ నమోదు: ఎమ్మెల్యే యెన్నం

కలం, మహబూబ్​నగర్​ బ్యూరో: ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థిలో దాగి ఉన్న సహజ ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించాల్సిన బాధ్యత విద్యా వాలంటీర్లపై ఉందని ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి (MLA Yennam Srinivas Reddy) అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ ఫస్ట్ శిక్షణ కేంద్రంలో శతశాతం విద్యా వాలంటీర్లతో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన జిల్లా కలెక్టర్, నగర మేయర్​తో కలిసి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా 100 మంది విద్యా వాలంటీర్లకు ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున గౌరవ వేతనాన్ని అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేవలం పాఠాలు బోధించడంతో తమ బాధ్యత పూర్తయిందని భావించకుండా, విద్యార్థులకు మార్గదర్శకులుగా, మెంటర్లుగా నిలవాలని సూచించారు. మహబూబ్‌నగర్‌లో చేపడుతున్న విద్యా వాలంటీర్ కార్యక్రమం రాష్ట్రంలోని ఇతర జిల్లాలకు కూడా విస్తరించాలనే ఉద్దేశంతో జిల్లా కలెక్టర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు ఆయన తెలిపారు.

ఇతర జిల్లాలకు విస్తరణ..

ఇతర జిల్లాల కలెక్టర్లకు కూడా ఈ కార్యక్రమం గురించి వివరించి, ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి విద్యా కార్యక్రమాలు విస్తరించేలా కృషి చేయాలని కోరారు. ఇతర అధికారిక కార్యక్రమాలు ఉన్నప్పటికీ విద్యా వాలంటీర్లను ప్రోత్సహించేందుకు కార్యక్రమానికి హాజరైన జిల్లా కలెక్టర్‌కు ఎమ్మెల్యే ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. విద్యా వాలంటీర్లకు అందుతున్న గౌరవ వేతనం కేవలం ఆర్థిక ప్రోత్సాహకం మాత్రమే కాదని, పిల్లలకు సేవ చేసే అవకాశం లభించిందనే భావనతో వారు ఎంతో ఉత్సాహంగా పనిచేస్తున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వాలంటీర్లు చేపడుతున్న కార్యక్రమాల వివరాలను వందే మాతరం ఫౌండేషన్ సమన్వయ కర్త రవీందర్ రెడ్డి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నారని తెలిపారు. విద్యా వాలంటీర్లు ఈ కార్యక్రమాన్ని ఒక ‘విద్యా యజ్ఞం’గా భావించి నిబద్ధతతో పనిచేస్తున్నారని, వారి పట్టుదల, సేవాభావం అభినందనీయమని కొనియాడారు.

2500 మందికి శిక్షణ

మహబూబ్‌నగర్ ఫస్ట్ ద్వారా గత ఏడాది కాలంగా మహిళలకు వివిధ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆరు బ్యాచ్‌లలో సుమారు 2500 మందికి శిక్షణ అందించినట్లు తెలిపారు. శిక్షణ సమయంలో మహిళల్లో కనిపించిన పట్టుదల, బాధ్యత తీసుకుని పనిచేసే సామర్థ్యం, ఆలోచనా విధానం తమకు విశ్వాసాన్ని కలిగించాయన్నారు. మహిళలకు బాధ్యత అప్పగించి, తగిన ప్రోత్సాహం అందిస్తే అద్భుతమైన ఫలితాలు సాధిస్తారనే నమ్మకం కలిగిన తర్వాతే ఇంత విస్తృతమైన విద్యా వాలంటీర్ కార్యక్రమాన్ని చేపట్టినట్లు వివరించారు. ప్రతి పాఠశాలలో కనీసం 20 నుంచి 30 మంది ప్రతిభావంతులైన విద్యార్థులను గుర్తించి, వారి ఆసక్తులు, అభిరుచులు, నైపుణ్యాలు, భవిష్యత్తు లక్ష్యాలను తెలుసుకోవాలని అన్నారు. రాబోయే రోజుల్లో విద్యార్థుల కోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కార్యక్రమాన్ని రూపొందించనున్నట్లు యెన్నం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ట్యాబ్‌ల ద్వారా విద్యార్థుల అభిరుచులు, ఆలోచనలు, లక్ష్యాలు, భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నారనే అంశాలను ప్రశ్నావళి రూపంలో నమోదు చేయనున్నట్లు చెప్పారు.

లక్ష్యాలకు డిజిటల్ భద్రత

ప్రతి విద్యార్థి వివరాలను డిజిటల్‌గా భద్రపరిస్తే, భవిష్యత్తులో వారికి అవసరమైన సమయంలో ఉన్నత విద్య, కెరీర్‌ మార్గదర్శకత్వం, ఇతర సహాయాన్ని అందించేందుకు వీలవుతుందని తెలిపారు. విద్యా వాలంటీర్లు నెలకు ఒకసారి పాఠశాలకు వెళ్లి తమ బాధ్యతను పూర్తి చేసే సాధారణ కార్యక్రమం ఇది కాదని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. నిర్దిష్ట లక్ష్యంతో ప్రారంభించిన దీర్ఘకాలిక ‘విద్యా యజ్ఞం’ గా దీనిని ముందుకు తీసుకెళ్లాలని అన్నారు. విద్యా వాలంటీర్లు, జిల్లా యంత్రాంగం, ప్రజాప్రతినిధులు, వందే మాతరం ఫౌండేషన్, మహబూబ్‌నగర్ ఫస్ట్ బృందం, ఉపాధ్యాయులు, మీడియా ప్రతినిధులు, సమాజంలోని ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. రాబోయే పది సంవత్సరాల పాటు ఈ కార్యక్రమాన్ని నిరంతరాయంగా కొనసాగిస్తూ, మహబూబ్‌నగర్‌లోని ప్రతి ప్రభుత్వ పాఠశాల విద్యార్థికి నాణ్యమైన విద్య, సరైన మార్గదర్శకత్వం, ప్రతిభకు తగిన ప్రోత్సాహం అందించడమే లక్ష్యంగా ముందుకు సాగాలని ఆయన అన్నారు.

బోధనా ప్రయత్నాలు అభినందనీయం

జిల్లా కలెక్టర్ ఖుష్బూ గుప్తా మాట్లాడుతూ విద్యా వాలంటీర్లకు గౌరవ వేతనం అందజేయడం ఎంతో సంతోషకరమైన విషయమన్నారు. కార్యక్రమంలో పలువురు విద్యా వాలంటీర్లు, ఉపాధ్యాయులు తమ అనుభవాలను పంచుకోవడం తనకు ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. పిల్లలకు పాఠ్యపుస్తకాలకే పరిమితం కాకుండా, బియాండ్‌ ది బుక్స్‌ వెళ్లి బోధించేందుకు వాలంటీర్లు చేస్తున్న కృషిని ఆమె అభినందించారు. కార్డులు, డిజిటల్‌ ట్యాబ్‌లు తదితర ఆధునిక బోధనా పద్ధతులను ఉపయోగిస్తూ విద్యార్థులు విషయాలను సులభంగా, ఆచరణాత్మకంగా నేర్చుకునేలా చేస్తున్న ప్రయత్నాలు ప్రశంసనీయమన్నారు. విద్యార్థులు భవిష్యత్తులో మంచి స్థాయికి ఎదిగినప్పుడు తమకు బోధించిన ఉపాధ్యాయులు, వాలంటీర్లను తప్పకుండా గుర్తు చేసుకుంటారని అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, వాలంటీర్లు చేస్తున్న కృషి మరింత మంది స్ఫూర్తి పొందేలా ఉండాలని, పిల్లల భవిష్యత్తు కోసం అందరూ మరింత అంకితభావంతో పనిచేయాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వందేమాతరం ఫౌండేషన్ ఫౌండర్ రవీందర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సిరాజ్ ఖాద్రీ, మహబూబ్‌నగర్‌ ఫస్ట్ పర్యవేక్షకులు గుండా మనోహర్, వందేమాతరం ఫౌండేషన్ సమన్వయకర్త రవీందర్ రెడ్డి,మహబూబ్‌నగర్‌ ఫస్ట్ ఇంచార్జీ నిజలింగప్ప తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>