కలం, ఖమ్మం బ్యూరో: రహదారులను సురక్షితంగా తీర్చిదిద్ది రోడ్డు ప్రమాదాలకు బ్రేక్ వేయాలని, బ్లాక్ స్పాట్లకు చెక్ పెడుతూ అధికారులు సమన్వయంతో పనిచేయాలని ఖమ్మం జిల్లా (Bhadradri Kothagudem) రెవెన్యూ అధికారి (డీఆర్వో) పద్మావతి ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ఈ ఏడాది జనవరి 1 నుంచి సెప్టెంబర్ 15 వరకు 370 రోడ్డు ప్రమాదాలు జరగ్గా, 176 మంది మృతి చెందారని, 367 మంది గాయపడ్డారని డీఆర్వో తెలిపారు.
99.4 శాతం కేసుల్లో ఎఫ్ఐఆర్ నమోదు చేసి చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. ప్రమాదకర మలుపులు, బ్లాక్స్పాట్లను గుర్తించి హెచ్చరిక బోర్డులు, రోడ్ మార్కింగ్లు, వీధి దీపాలు ఏర్పాటు చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న 7 ‘హిట్ అండ్ రన్’ కేసులను సాంకేతిక ఆధారాలతో త్వరగా ఛేదించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రవాణా అధికారి భూషిత్ రెడ్డి, డీఆర్ఎం జి. బాలాజీ, డీహెచ్ఎంఓ తుకారాం రాతోడ్, ఆర్అండ్బీ ఈఈ, ట్రాఫిక్ ఎస్ఐ పాల్గొన్నారు.

