కలం, ఖానాపూర్: టింబర్ డిపో రెన్యూవల్ కోసం లంచం తీసుకుంటున్న ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ (ఎఫ్‌ఎస్‌ఓ)ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అటవీ క్షేత్రాధికారి కార్యాలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడులు చేపట్టారు. ఏసీబీ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం.. ఖానాపూర్‌కు చెందిన రవితేజ తన టింబర్ డిపో రెన్యూవల్ కోసం గత ఆగస్టులో దరఖాస్తు చేసుకున్నారు.
రెన్యూవల్ కోసం ఎఫ్‌ఎస్‌ఓ అయిండ్ల రవీందర్ రూ.50 వేలు లంచం డిమాండ్ చేసినట్లు తెలిపారు. చివరకు రూ.12 వేలకు ఒప్పందం కుదిరింది. లంచం ఇవ్వడం ఇష్టం లేని రవితేజ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఏసీబీ అధికారులు పక్కా ప్రణాళికతో కార్యాలయంలో వల పన్నారు. ఈ క్రమంలో రవీందర్ రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.
ప్రభుత్వ అధికారులు లంచం డిమాండ్ చేస్తే ప్రజలు భయపడకుండా ఏసీబీకి ఫిర్యాదు చేయాలని డీఎస్పీ జి. మధు సూచించారు. ఫిర్యాదుల కోసం 9154388963, టోల్‌ఫ్రీ నంబర్ 1064, ఏసీబీ హెల్ప్‌లైన్ వాట్సాప్ నంబర్ 9440446106ను సంప్రదించవచ్చని తెలిపారు.

