కలం, వెబ్‌డెస్క్: బ్రిటన్‌కు చెందిన ప్రముఖ పత్రిక ‘ది ఎకనామిస్ట్’ (The Economist) ప్రచురించిన ఒక ఆర్టికల్‌పై సినీ నటుడు, మక్కల్ నీది మయ్యం అధినేత కమల్ హాసన్ (Kamal Haasan) ఎక్స్ వేదికగా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ వన్యప్రాణి సంరక్షణపై విదేశీ మీడియా అనుసరిస్తున్న తీరును, వలసవాద ధోరణిని ఆయన తప్పుపట్టారు. బ్రిటీష్ వలస పాలనలో భారతదేశంలోని సింహాలు, పులులు అంతరించిపోయే స్థాయికి వేటాడబడ్డాయని విమర్శించారు. అలాంటి దేశం మనకు కన్జర్వేషన్ గురించి పాఠాలు చెప్పడం ఏమిటని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. భారతదేశంలో మానవుడు, జంతువులు ప్రకృతితో మమేకమై జీవించవచ్చనే సత్యాన్ని ప్రాచీన కాలం నుంచే నమ్ముతున్నామని, తమిళనాడులోని ‘జల్లికట్టు’ వంటి సంప్రదాయాలే ఇందుకు సజీవ సాక్ష్యమని తెలిపారు.
భారతదేశం చేపట్టిన ప్రతిష్టాత్మక ‘ప్రాజెక్ట్ చీతా’ అద్భుత విజయాలను సాధించిందని ఆయన కొనియాడారు. ప్రారంభంలో కొన్ని ఎదురుదెబ్బలు తగిలినప్పటికీ, భారత ప్రభుత్వం వాటిని అధిగమించి నేడు 60 చీతాలకు నిలయంగా మార్చిందన్నారు. ఇందులో 41 భారతదేశంలోనే జన్మించాయని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మొట్టమొదటి అంతర ఖండాల మాంసాహార జంతువుల తరలింపును భారత్ విజయవంతంగా పూర్తి చేసిందని, అంతేకాకుండా అంతర్జాతీయ బిగ్ క్యాట్ అలయన్స్‌ను కూడా ఏర్పాటు చేసిందని గుర్తు చేశారు.
దేశవ్యాప్తంగా పులులు, ఆసియా సింహాల సంఖ్య పెరుగుతోందని కమల్ (Kamal Haasan) హర్షం వ్యక్తం చేశారు. రాజస్థాన్‌లో గ్రేట్ ఇండియన్ బస్టర్డ్, హిమాచల్ ప్రదేశ్‌లో మంచు చిరుతలు, తమిళనాడులో నీలగిరి తార్, డ్యూగాంగ్‌లు, అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో ఖడ్గమృగాలు, రెడ్ పాండాల సంరక్షణ సజావుగా సాగుతోందని వివరించారు. భారతదేశం సాధించిన ఈ అద్భుతమైన సంరక్షణ విజయాలను ప్రపంచం కొనియాడాలని, అంతేకాని వాటిని వలసవాద దురహంకారంతో చూడటం సరికాదని కమల్ హాసన్ తన పోస్టులో హితవు పలికారు.
Also Read : మోదీ ఓట్లను దొంగిలించి ప్రధాని అయ్యారు.. అభిజీత్ దీప్కే ఫైర్
Follow Us On : WhatsApp

