కలం, ఖమ్మం బ్యూరో: ఖమ్మం (Khammam) జిల్లాలో కాంగ్రెస్ నేతల భూకబ్జాలు, అక్రమ దందాలు హద్దు మీరుతున్నాయని, కాంగ్రెస్ అక్రమ పాలనపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరపడ్డాయని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) హెచ్చరించారు. గురువారం ఖమ్మం నియోజకవర్గ బీఆర్ఎస్ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొన్న ఆయన, స్థానిక కాంగ్రెస్ నాయకుల అక్రమ సంపాదన మోజుపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ నేతలు భూములు, మట్టి, బెరైటీస్ నిల్వలను అక్రమంగా కొల్లగొడుతూ వందల కోట్ల రూపాయల దందాలకు పాల్పడుతున్నారని పువ్వాడ ఆరోపించారు. రక్షణగా ఉండాల్సిన ప్రజాప్రతినిధులే స్వార్థ ప్రయోజనాల కోసం అమాయక గిరిజనుల భూములను సైతం వదలకుండా కబ్జాలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రకృతి వనరులను విచక్షణారహితంగా దోచుకుంటూ వందల కోట్లు వెనకేసుకుంటున్న వారి నిజ స్వరూపాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ నేతల అక్రమాల వల్ల తమ నియోజకవర్గం, జిల్లా ఎంతగా నష్టపోతుందో ప్రజలు నిశితంగా గమనిస్తున్నారని పువ్వాడ స్పష్టం చేశారు. వారి దోపిడీ పాలనపై ప్రజల్లో ఇప్పటికే తీవ్ర వ్యతిరేకత మొదలైందని, రాబోయే రోజుల్లో ఈ అక్రమాలను నిలదీసి కాంగ్రెస్కు గుణపాఠం చెప్పడం ఖాయమని వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ శ్రేణులు ప్రజాక్షేత్రంలో ఉంటూ, బాధితులకు అండగా నిలిచి కాంగ్రెస్ దందాలను ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

