విద్యార్థికి ఆకులు తినిపించిన టీచర్​.. కలెక్టర్‌కు ఫిర్యాదు..!

కలం, మెదక్ బ్యూరో : ఎనిమిదో తరగతి విద్యార్థినికి చెట్ల ఆకులు తినిపించిన ఉపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమ సింగ్‌ కు వినతి పత్రం అందజేశారు. బాధితుల కథనం ప్రకారం.. మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణ పరిధిలోని నారాయణపూర్ తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో (Narayanapur Gurukulam)  కొల్చారం మండలం పోతిరెడ్డిపల్లి తండాకు చెందిన గిరిజన విద్యార్థిని దీప 8వ తరగతి చదువుతోంది.

ఇటీవల తరగతి గదిని శుభ్రం చేస్తున్న సమయంలో అక్కడ ఉన్న స్టూల్ మరో విద్యార్థినికి తగిలింది. దీంతో ఆగ్రహించిన క్లాస్ టీచర్ శ్రీలత.. శిక్ష పేరుతో దీపను బయటకు తీసుకెళ్లి చెట్ల ఆకులు తినిపించినట్లు విద్యార్థిని, ఆమె తల్లిదండ్రులు ఆరోపించారు. ఆకులు తినిపించడంతో విద్యార్థినికి తీవ్రంగా వాంతులు వచ్చినట్లు వారు తెలిపారు. ఈ విషయాన్ని గమనించిన పాఠశాల సిబ్బంది ఆమె తల్లిదండ్రులకు సమాచారం అందించగా, వారు పాఠశాలకు చేరుకుని బాలికను ఇంటికి తీసుకెళ్లి చికిత్స అందించారు.

అనంతరం బాలికను తిరిగి పాఠశాలకు తీసుకొచ్చిన ఆమె తండ్రి సంతోష్ కుమార్.. తన కుమార్తెకు చెట్ల ఆకులు ఎందుకు తినిపించారని ఉపాధ్యాయురాలు శ్రీలతను ప్రశ్నించినట్లు తెలిపారు. అయితే, ఉపాధ్యాయురాలు తమపై ఆగ్రహం వ్యక్తం చేయడంతో పాటు బెదిరింపు ధోరణిలో మాట్లాడినట్లు తండ్రి సంతోష్​ కుమార్​ ఆరోపించారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్‌కు సమర్పించిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఉపాధ్యాయురాలి ప్రవర్తనతో తన కుమార్తె తీవ్ర భయాందోళనకు గురై పాఠశాలకు వెళ్లేందుకు నిరాకరిస్తోందని తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. నారాయణపూర్ గురుకుల పాఠశాలలో జరిగిన ఘటనపై సమగ్ర విచారణ జరిపి, విద్యార్థిని పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉపాధ్యాయురాలు శ్రీలతపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తల్లిదండ్రులు కలెక్టర్ కు విన్నవించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>