కలం, వెబ్ డెస్క్ : సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఇండి కూటమి నేతలు చేపట్టి చలో లోక్ భవన్ (Chalo Lok Bhavan) కార్యక్రమం ఉద్రిక్తతగా మారింది. లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించిన కూటమి నేతలను పోలీసులు అడ్డుకున్నారు. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో కొనసాగిన కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి, కాంగ్రెస్ పార్టీ నేతలు లోక్ భవన్ ముట్టడికి ప్రయత్నించారు.
ముట్టడి (Chalo Lok Bhavan) లో భాగంగా లోక్ భవన్ వైపు వెళ్లేందుకు యత్నించిన నేతలను పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. నేతలు, పోలీసుల మధ్య ఘర్షణ చోటు చేసుకోవడంతో పీసీసీ చీఫ్ తో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకులను అరెస్ట్ చేశారు. అదుపులోకి తీసుకున్న వారిని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.
మంత్రులు, నాయకులను అరెస్ట్ చేయడంతో కాంగ్రెస్, వామపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి కార్యకర్తలు పంజాగుట్ట పోలీస్ వద్దకు భారీగా చేరి నానా హంగామా సృష్టించారు. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్న ఈసీకి వ్యతిరేకంగా ఆందోళన చేపడితే అరెస్ట్ చేస్తారా అని ప్రశ్నించారు. కేంద్రప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘానికి వ్యతిరేకంగా కార్యకర్తలు నినాదాలు చేశారు.

