కలం, హైదరాబాద్: ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ వికలాంగులు హైదరాబాద్లోని బస్ భవన్ (Bus Bhavan) ఎదుట ధర్నాకు దిగారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ నిరసన చేపట్టారు. వికలాంగుల హక్కులు, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నడిచే అన్ని రకాల ఆర్టీసీ బస్సుల్లో వికలాంగులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని నిరసనకారులు కోరారు. అలాగే వికలాంగులకు జారీ చేసిన ప్రయాణ పాసులను అన్ని రకాల బస్సుల్లో అనుమతించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన అంశాలను ఆలస్యం చేయకుండా అమలు చేయాలని వారు ప్రభుత్వాన్ని కోరారు.
ధర్నా సందర్భంగా వికలాంగులు పెద్ద సంఖ్యలో బస్ భవన్ వద్దకు చేరుకుని తమ డిమాండ్లను వినిపించారు. దీంతో అక్కడ కొంతసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. నిరసనకు అనుమతి లేదంటూ పోలీసులు వారిని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులకు, నిరసనకారులకు మధ్య కొంత వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం.
తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే శాంతియుతంగా ధర్నా నిర్వహిస్తున్నామని వికలాంగులు తెలిపారు. హామీల అమలుతో పాటు బస్ పాసుల విషయంలో స్పష్టమైన నిర్ణయం తీసుకునే వరకు తమ ఆందోళన కొనసాగిస్తామని వారు పేర్కొన్నారు.

