కలం, కరీంనగర్ : హుస్నాబాద్ నియోజకవర్గం చిగురుమామిడి మండలం పీచుపల్లి, సీతారాంపూర్ గ్రామంలో ‘పల్లె పల్లెకు పొన్నం అన్న – పల్లె పల్లెలో ప్రజా పాలన’ కార్యక్రమంలో భాగంగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించి, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. గ్రామంలో ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా అందుతున్నాయో స్వయంగా తెలుసుకోవడమే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశ్యమని మంత్రి తెలిపారు.
ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు అదనపు ఆదాయం :
రైతులు సంప్రదాయ పంటలతో పాటు ఆయిల్‌పామ్ సాగుపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు. ప్రభుత్వం ఆయిల్‌పామ్ మొక్కలు, డ్రిప్ సదుపాయాలను అందిస్తోందని తెలిపారు. ఆయిల్‌పామ్ సాగుతో రైతులకు దీర్ఘకాలికంగా మంచి ఆదాయం లభిస్తుందని, కోతుల బెడద తక్కువగా ఉంటుందని, ప్రకృతి వైపరీత్యాల ప్రభావం కూడా ఇతర పంటలతో పోలిస్తే తక్కువగా ఉంటుందని మంత్రి పేర్కొన్నారు.
నీటి సంరక్షణకు చర్యలు..
వర్షపు నీటిని వృథా కాకుండా ఒడిసిపట్టుకోవాలని మంత్రి సూచించారు. ప్రతి ఇంట్లో ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాలని, ప్రతి పొలంలో పంటకుంట నిర్మించుకోవాలని, ప్రతి గ్రామంలో ఊరుకుంట ఏర్పాటు చేసుకోవాలని అన్నారు. జలసిరి కార్యక్రమం ద్వారా ఇంటింటా ఇంకుడు గుంతల నిర్మాణానికి ప్రభుత్వం రూ.6,500 వరకు ఆర్థిక సహాయం అందిస్తోందని తెలిపారు. మల్లన్న గుట్టలు, పెద్ద గుట్టల నుంచి వచ్చే వర్షపు నీటిని ఇంకుడు గుంతల ద్వారా భూగర్భ జలాల్లోకి ఇంకించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
మహిళల ఆర్థిక సాధికారతకు ప్రాధాన్యత
మహిళా సంఘాలకు సున్నా వడ్డీ రుణాలు అందించడంతో పాటు, రుణ పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని పొన్నం (Minister Ponnam) తెలిపారు. మహిళలకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు కల్పించి ఆర్థికంగా బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు. రైతులు పాడి పరిశ్రమ, పశుపోషణపై దృష్టి పెట్టాలని సూచించారు. ప్రజల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి సారించామని గ్రామంలో నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
చిగురుమామిడి మండల కేంద్రంలో తెలంగాణ పబ్లిక్ స్కూల్ మంజూరు చేయడంతో పాటు, ఇటీవల ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారని పొన్నం తెలిపారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు అర్హత కలిగిన ఉపాధ్యాయులను అందుబాటులో ఉంచుతున్నామని ఆయన హామినిచ్చారు. యువత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాలకు దూరంగా ఉండేలా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో గ్రామాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు.
ఆయా కార్యక్రమాల్లో జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా, ఆర్డీవో షర్మిల, సర్పంచ్ పీచు సత్యనారాయణ రెడ్డి, PACS చైర్మన్ రవీందర్, హుస్నాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి రెడ్డి, వడ్డెర కార్పొరేషన్ వైస్ చైర్మన్ బత్తుల వెంకటేష్, తహసీల్దార్, ఎంపీడీవో, వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

