ఇసుక లారీలపై కలెక్టర్, ఎస్పీ సీరియస్.. కీలక ఆదేశాలు

​కలం, ఖమ్మం బ్యూరో: జిల్లాలో (Bhadradri Kothagudem) ఇసుక రవాణా పేరుతో నిబంధనలు ఉల్లంఘిస్తే సహించేది లేదని, రోడ్డెక్కితే రూల్స్ కచ్చితంగా పాటించాల్సిందేనని కలెక్టర్ అంకిత్, ఎస్పీ రోహిత్ రాజు హెచ్చరించారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయంలో ఇసుక రవాణా, ట్రాఫిక్ నిర్వహణ, అక్రమ రవాణా నిరోధంపై సమీక్ష నిర్వహించారు. ప్రజా రవాణాకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా శాఖలన్నీ సమన్వయంతో పనిచేయాలని వారు స్పష్టం చేశారు.

​మణుగూరు, చర్ల, భద్రాచలం, బూర్గంపాడు ప్రాంతాల్లో రోడ్ల సామర్థ్యాన్ని బట్టి లారీలను దశలవారీగా అనుమతించాలని, ఒకేసారి రాకపోకలు సాగించి ట్రాఫిక్ స్తంభింపజేయొద్దని ఆదేశించారు. గొల్లగూడెం, సారపాక బ్రిడ్జి, తాళ్లగూడెం, పినపాక పట్టినగర్ తదితర ప్రాంతాల్లో ప్రత్యేక హోల్డింగ్, పార్కింగ్ ఏరియాలను అందుబాటులోకి తేవాలన్నారు. అంబులెన్స్‌లు లాంటి అత్యవసర వాహనాల రాకపోకలకు ఆటంకం కలగకుండా చూడాలన్నారు. చర్ల-భద్రాచలం మార్గంలో ప్రత్యేక ట్రాఫిక్ నిర్వహణ చేపడుతూ, రహదారి మరమ్మతుల నాణ్యతపై నివేదిక సమర్పించాలని సూచించారు.

​రద్దీ ప్రాంతాల్లో అదనపు ట్రాఫిక్ మార్షల్స్‌ను ఏర్పాటు చేసి, టీజీఎండీసీతో సమన్వయం చేసుకోవాలని ఎస్పీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి జరిగే అక్రమ ఇసుక రవాణాపై ఉక్కుపాదం మోపాలని ఆదేశించారు. అక్రమ రవాణాకు పాల్పడే వాహనాలు, జేసీబీలపై కఠిన కేసులు నమోదు చేసి భారీ జరిమానాలు విధించాలని ఆదేశించారు. సీజ్ చేసిన ఇసుకను తరలించేందుకు ప్రత్యేక మెకానిజం ఏర్పాటు చేయాలన్నారు.

పోలీసు, రెవెన్యూ, మైనింగ్, టీజీఎండీసీ అధికారులు నిరంతర పర్యవేక్షణతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడకుండా, ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని కోరారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్, సబ్ కలెక్టర్ మృణాల్ శ్రేష్ఠ, డీఆర్ఓ పద్మావతి, ఇతర అధికారులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>