హుజూరాబాద్‌లో ‘ఇందిరమ్మ ఇళ్ల’ నీడలో కబ్జా పర్వం..!

కలం, హుజూరాబాద్ : పేదల సొంతింటి కలను సాకారం చేయాల్సిన పవిత్రమైన ‘ఇందిరమ్మ ఇళ్ల’ పథకాన్ని (Indiramma Housing Scheme) కొందరు స్వార్థపరులు కబ్జాలకు, అక్రమ నిర్మాణాలకు అడ్డగా మార్చుకుంటున్నారు. కనీస అనుమతులు లేవు, నాలా (వ్యవసాయేతర భూమి) మార్పిడి ఊసే లేదు.. చివరకు యాజమాన్య హక్కు పత్రాలు కూడా లేకుండానే ఇతరుల రిజిస్టర్డ్ స్థలాల్లోకి చొరబడి యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. హుజూరాబాద్ (Huzurabad) పట్టణ నడిబొడ్డున పక్కా ప్రణాళికతో సాగుతున్న ఈ అక్రమ తతంగంపై మున్సిపల్, రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే నాథుడే కరువయ్యారని బాధితులు ఆరోపిస్తున్నారు.

హద్దులు దాటి.. దౌర్జన్యంగా చొరబడి!

హుజూరాబాద్ (Huzurabad) మున్సిపాలిటీ పరిధిలోని 9వ వార్డు, దమ్మక్కపేట శివారు సర్వే నంబర్ 1988 A/C/A లో సబ్బని వరలక్ష్మి అనే మహిళ 2019లో బోరుగాల సులోచన వద్ద 242 చదరపు గజాల (రెండు గుంటలు) నివేశన స్థలాన్ని కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. గత ఏడేళ్లుగా సదరు స్థలం ఆమె స్వాధీనంలోనే ఉంది. అయితే, ఇటీవల ఆమె స్థలానికి ఉత్తరం వైపున పాక స్వరూప, పాక సాయికిరణ్ అనే తల్లీకొడుకులు ఇందిరమ్మ పథకం కింద ఇంటి నిర్మాణం ప్రారంభించారు. సదరు వ్యక్తులు తమ స్థలానికే పరిమితం కాకుండా, వరలక్ష్మికి చెందిన రిజిస్టర్డ్ స్థలంలోకి సుమారు 12 అంగుళాల (ఒక అడుగు) మేర నిబంధనలకు విరుద్ధంగా చొచ్చుకువచ్చి పునాదులు, పిల్లర్ల నిర్మాణం చేపట్టారని బాధితులు చెబుతున్నారు.

నిబంధనలకు పాతర.. నాలా మార్పిడి ఏదీ?

నియమ నిబంధనల ప్రకారం వ్యవసాయ భూమిలో నిర్మాణాలు చేపట్టాలంటే చట్టబద్ధమైన నాలా (NALA) కన్వర్షన్ తప్పనిసరి. కానీ ఇక్కడ ఎటువంటి నాలా మార్పిడి జరగలేదు. పోనీ మున్సిపాలిటీ నుంచి TS-bPASS ద్వారా అనుమతులు పొందారా అంటే అదీ లేదు. కనీస సెట్‌బ్యాక్ నిబంధనలు పాటించకుండా, ఎటువంటి యాజమాన్య హక్కు పత్రాలు లేకుండానే గుట్టుచప్పుడు కాకుండా పనులు సాగిస్తున్నట్లు సబ్బని వరలక్ష్మి ఆరోపిస్తున్నారు. తమ హద్దుల్లోకి ఎందుకు వస్తున్నారని బాధితులు ప్రశ్నిస్తే, సమాధానం చెప్పకపోగా బెదిరింపులకు, దౌర్జన్యాలకు దిగుతూ రాత్రింబవళ్లు పనులను వేగవంతం చేస్తున్నారని సబ్బని వరలక్ష్మి కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమయ్యారు.

అధికారుల ఉదాసీనత ఎవరి కోసం?

కళ్లముందే ఇంత పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణం జరుగుతున్నా క్షేత్రస్థాయి టౌన్ ప్లానింగ్, రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది. అనుమతులు లేని నిర్మాణాలపై తక్షణమే ‘స్టాప్ వర్క్’ (పనుల నిలుపుదల) నోటీసులు జారీ చేసి అడ్డుకోవాల్సిన అధికార యంత్రాంగం చోద్యం చూస్తోందా? అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించి నిర్మిస్తున్న ఈ ఇంటికి హౌసింగ్ అధికారులు బిల్లులు ఎలా మంజూరు చేస్తారనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

తక్షణమే చర్యలు చేపట్టాలి : బాధితురాలి వేడుకోలు

తమ స్థలాన్ని కాపాడాలని బాధితురాలు వరలక్ష్మి జిల్లా కలెక్టర్, మున్సిపల్ డైరెక్టర్ (CDMA), ఆర్డీఎంఏ, తహశీల్దార్, స్థానిక మున్సిపల్ అధికారులకు ఆధారాలతో సహా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. సంబంధిత రెవెన్యూ సర్వేయర్‌తో తక్షణమే సర్వే నిర్వహించి హద్దులు తేల్చాలని, ఆక్రమించి వేసిన 12 అంగుళాల పిల్లర్లను తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. హద్దుల వివాదం తేలేవరకు ఇందిరమ్మ పథకం నిధులు నిలిపివేయాలని విజ్ఞప్తి చేశారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు మేల్కొని అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోకపోతే ఆందోళనకు దిగుతామని బాధితులు స్పష్టం చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>